చైనాతో జరుగుతున్న వాణిజ్య చర్చలు మరో నాలుగు వారాల్లో కొలిక్కి వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్నాయి.
" ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గర్లో ఉన్నాం. చర్చల ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది" అని ట్రంప్ అన్నారు. శ్వేతసౌధంలో చైనా వాణిజ్య రాయబారి ల్యూ హేతో ఆయన భేటీ అయ్యారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం జరిగాక... చైనా అధ్యక్షుడితో తాను భేటీ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పారు ట్రంప్.
ఏడాది కాలంగా వాణిజ్య యుద్ధం
ఒప్పందం కోసం జరుగుతున్న చర్చల్లో అమెరికా లేవనెత్తిన వాణిజ్య ఆందోళనలన్నీ చైనా పరిగణలోకి తీసుకోవాలని ట్రంప్ ఇది వరకే వ్యాఖ్యానించారు.
చైనాతో వాణిజ్య యుద్ధానికి గతేడాది తెరతీశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికా ఎగుమతులపై అధిక సుంకం వేస్తూ చైనా అధిక లాభం పొందుతోందని అగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ సాంకేతికతను డ్రాగన్ దేశం అనైతికంగా కొల్లగొడుతోందని అన్నారు.
అప్పటి నుంచి అమెరికా, చైనా పోటీ పడి మరీ ఎగుమతులపై సుంకాలను పెంచుకుంటూ వస్తున్నాయి. దాదాపు 360 బిలియన్ డాలర్ల సుంకాలను గతేడాది నుంచి పరస్పరం విధించుకున్నాయి. దీంతో ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం పడింది. ఆ తర్వాతి నుంచి చర్చల ద్వారా వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాయి ఇరు దేశాలు. అప్పటి నుంచి చర్చలు కొనసాగుతున్నాయి.