చైనా-అమెరికాల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఇరు దేశాలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మరోమారు వాణిజ్య చర్చలు జరిపేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు చైనా ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ ప్రారంభంలో వాషింగ్టన్లో ఈ చర్చలు జరపాలని నిర్ణయించినట్లు పేర్కొంది. కచ్చితంగా ఏ తేదీన చర్చలు జరుగుతాయనేది వెల్లడించలేదు. ఈ సారి చర్చల ద్వారా ఇరు దేశాలకు సానుకూలమైన వాణిజ్య వాతావరణం సృష్టించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో తమ మేధో సంపత్తి, సాంకేతికత బదిలీకి రక్షణ కల్పించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుతూ వచ్చారు. అలాగే అగ్రరాజ్యం దిగుమతులకు చైనా ఎక్కువ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే ఇరుదేశాల మధ్య ఉన్న వాణిజ్య పరమైన చిక్కులతో.. 12 రౌండ్ల చర్చలు విఫలమయ్యాయి. చర్చల విఫలం తర్వాత ఇరు దేశాలు పరస్పరం సుంకాలు పెంచుకున్నాయి.
ఈ నేపథ్యంలో తమ వస్తువులపై అమెరికా ఇష్టానుసారంగా సుంకాలు పెంచుతోందని డబ్ల్యూటీఓకు ఫిర్యాదు చేసింది డ్రాగన్. వివాద పరిష్కారానికే డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. అయితే వాణిజ్య చర్చలకు తాము సిద్ధంగా ఉన్నా.. చైనానే చర్చల విషయంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి.. సుంకాలను పెంచుకుంటూ పోవడం కారణంగా.. ఆ ప్రభావం ప్రపంచ వాణిజ్యంపైనా తీవ్రంగా పడింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనానికీ కారణమైంది. అమెరికా సుంకాల మోతతో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి రేటు 27 ఏళ్ల కనిష్ఠం వద్ద 6.2 శాతానికి పడిపోయింది.
ఇదీ చూడండి: రష్యా వేదికగా నాయక్‌కు ఉచ్చు బిగించిన మోదీ