ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) సభ్యత్వంతో అమెరికా, చైనా దేశాలు భారీగా లబ్ధిపొందినట్టు బెర్టెల్స్మన్ ఫౌండేషన్ సంస్థ పరిశోధనలో తేలింది. డబ్ల్యూటీఓ సభ్యత్వం వల్ల అమెరికా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 87 బిలియన్ డాలర్లు పెరిగిందని తెలిపింది. డబ్ల్యూటీఓలో అమెరికాకు 25ఏళ్లుగా సభ్యత్వం ఉంది.
2001లో డబ్ల్యూటీఓలో చేరిన చైనా.. వృద్ధిలో 86 బిలియన్ డాలర్లు లబ్ధి పొందింది. జర్మనీ 66 బిలియన్ డాలర్లతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.
డబ్ల్యూటీఓను స్థాపించి రేపటితో(జనవరి 1)తో 25ఏళ్లు పూర్తవుతాయి. ప్రస్తుతం ఈ సంస్థలో 164 సభ్య దేశాలు ఉన్నాయి.
"ప్రపంచవ్యాప్తంగా.. డబ్ల్యూటీఓ సభ్య దేశాల జీడీపీ సగటున 4.5శాతం పెరిగింది. 1980-2016 మధ్యకాలంలో వారి ఎగుమతులు 14శాతం మేర పెరిగాయి. సభ్యత్వం లేని దేశాల ఎగుమతులు 6శాతం క్షీణించాయి. ఎగుమతులు, ఉత్పత్తులు గరిష్ఠంగా ఉన్న దేశాలే ఎక్కువ లాభం పొందాయి."
--- బెర్టెల్స్మన్ ఫౌండేషన్.
తక్కువ ఉత్పత్తి పరిశ్రమలున్న ఐరోపా దేశాలు.. డబ్ల్యూటీఓ సభ్యత్వంతో పెద్దగా లబ్ధి పొందలేదని నివేదిక పేర్కొంది. ఫ్రాన్స్ 25 బిలియన్లు, బ్రిటన్ 22 బిలియన్లు లాభం పొందినట్టు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- భారత్లోని సొంతూరుకు వచ్చిన ఐర్లాండ్ ప్రధాని