కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనా సంస్థలు కృషిచేస్తున్నాయి. ఇందులో కొన్ని టీకా, ఔషధాల కోసం పనిచేస్తుంటే.. మరికొన్ని వైరస్ ఆనవాళ్లను వేగంగా గుర్తించే ప్రక్రియ ఆవిష్కరణపై దృష్టి సారించాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే ఆయా అంశాల్లో పురోగతి సాధించాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ కంపెనీ కేవలం ఐదు నిమిషాల్లో కరోనాను కనుక్కునే నిర్ధరణ ప్రక్రియను అభివృద్ధి చేసింది.
అనుమతి కోసం ఎదురుచూపులు..
అమెరికాకు చెందిన అబోట్ ల్యాబొరేటరీస్ అభివృద్ధి చేసిన ఈ టెస్టులకు.. ఇప్పటికే అత్యవసర ప్రక్రియ కింద అనుమతినిచ్చింది అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ). అయితే ఈ ప్రక్రియకు పూర్తి స్థాయి అమోదం లభించాల్సి ఉంది.
ప్రస్తుతానికి గుర్తింపు పొందిన ల్యాబ్‌లలో అత్యవసర ప్రాతిపదిక కింద మాత్రమే ఉపయోగిస్తున్నారు. వచ్చే వారం నుంచి వీటిని ఉపయోగంలోకి తెచ్చే దిశగా సన్నాహాలు జరుగుతున్నట్లు ల్యాబ్ నిర్వాహకులు తెలిపారు.
"'మాలిక్యులాల్ పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్'గా పిలిచే ఈ ప్రక్రియలో కరోనా వైరస్ ఉన్న వ్యక్తి ఫలితాలు కేవలం ఐదు నిమిషాల్లో తెలిసిపోతుంది. నెగిటివ్ ఉన్నవారి ఫలితం రావడానికి 13 నిమిషాలు పడుతుంది"
--రాబర్ట్ ఫోర్డ్, అబోట్ ల్యాబొరేటరీస్ ఛైర్మన్
కరోనా వైరస్‌ను జయించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఆ దిశగా అబోట్ లేబోరేటరీస్ కృషి చేస్తోందని సంస్థ ఛైర్మన్ రాబర్ట్ ఫోర్డ్ తెలిపారు. అతి తక్కువ సమయంలో ఈ వైరస్‌ను గుర్తించడానికి ఇదో గొప్ప అవకాశం అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ పరీక్షలో ఉపయోగించే పరికరం చిన్న పరిమాణంలో ఉండడం వల్ల దీన్ని ఎక్కడైనా వినియోగించొచ్చని తెలిపారు. ఆస్పత్రులు, క్లినిక్‌లు, లేబోరేటరీలలోనే కాకుండా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకూ వీటిని తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు.