అమెరికా వీసాపై సుమారు రెండున్నర నెలల ఎదురుచూపులు ఫలించనున్నాయి. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో లాక్‌డౌన్ విధించటంతో కాన్సులేట్, రాయబార కార్యాలయాలను అమెరికా మూసివేసింది ఈ ఏడాది మార్చి 20న వీసా ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. తాజాగా ప్రీమియం విధానాన్ని సోమవారం ప్రారంభించనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. మార్చి 20లోపు వీసా గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఐ-129, ఐ-140 ఆమోదం కోసం మరోసారి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గతంలో ఎలాంటి దరఖాస్తు చేయనివారు ప్రస్తుతం దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉండదు. ఈ రెండు విభాగాలకు సంబంధించిన ప్రక్రియను మాత్రమే ఈ విధానంలో చేపట్టాలని అమెరికా నిర్ణయించింది.
ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు కంపెనీలు దరఖాస్తు చేస్తే సాధారణ ప్రక్రియ పూర్తయ్యేందుకు 6 నుంచి 8 నెలల వ్యవధి పడుతుంది. ప్రీమియం విధానంలో కేవలం 15 రోజుల వ్యవధిలో దరఖాస్తు ఆమోదం పొందిందా, లేదా అన్నది యూఎస్‌సీఐఎస్ స్పష్టత ఇస్తుంది. ఈ ప్రక్రియ కింద 12 నుంచి 15 వేల డాలర్లను వసూలు చేస్తుంది. నిబంధనల ప్రకారం అమెరికాలో హెచ్1బీ వీసాపై పనిచేస్తూ వీసా గడువు ముగిసిన వారు సుమారు 60 రోజుల వ్యవధిలో మాతృదేశానికి తిరిగివెళ్లాల్సి ఉంటుంది.
భారీ సంఖ్యలో దరఖాస్తులు
ప్రీమియం వీసా ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగుల వీసా గడువు జులైలో ముగియనుంది. భారతదేశానికి చెందిన సుమారు రెండు లక్షల మంది ఉద్యోగుల వీసా గడువు ముగియనుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు వేల సంఖ్యలో ఉంటారని అంచనా. ప్రీమియం వీసా ప్రక్రియలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వీసాదారులు పెద్దసంఖ్యలోనే దరఖాస్తు చేసుకుంటారని అమెరికాలోని తెలుగు అటార్నీ ఒకరు 'ఈనాడు'తో చెప్పారు. ప్రీమియం విభాగంలో ఐ-129, ఐ-140 దరఖాస్తులు ఆమోదం పొందిన పక్షంలో హెచ్1బీ వీసా గడువును పొడిగించేంత వరకు అమెరికాలో ఉండేందుకు వెసులుబాటు లభిస్తుంది. వారిపై ఆధారపడిన డిపెండెంట్ (హెచ్4) వీసాదారులకూ అదే అవకాశం ఉంటుంది.