అమెరికాలో మరో కరోనా వాక్సిన్‌కు త్వరలో అనుమతి లభించనున్నట్లు తెలుస్తోంది. జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ టీకాకు అత్యవసర అనుమతినివ్వాలని ఆ దేశ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ప్యానల్ సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపితే.. సోమవారం రోజే కొద్ది మోతాదులో అమెరికాకు జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు అందనున్నాయి. అమెరికాలోని వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) ప్యానల్ సభ్యులు జాన్సన్ అండ్ జాన్సన్ టీకా అనుమతి, దాన్ని ఎలా ఇవ్వాలి అనే విషయంపై ఆదివారం సమావేశం నిర్వహించనున్నారు.
అమెరికాలో ఇప్పటికే ఫైజర్, మోడెర్నా టీకాలను పంపిణీ చేస్తున్నారు. ఈ టీకాకు అనుమతి లభిస్తే దేశంలో మూడు వాక్సిన్లకు అనుమతి లభించినట్లవుతుంది.
అయితే ఫైజర్ టీకాతో పోలిస్తే జాన్సన్ అండ్ జాన్సన్ టీకా సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్‌పై ఫైజర్ టీకా 95 శాతం ప్రభావం చూపుతుందని, అదే జాన్సన్ టీకా అంత ప్రభావాన్ని చూపలేదని అంటున్నారు.
దేశంలో కరోనా కేసుల్ని వేగంగా తగ్గించడానికి మూడో వ్యాక్సిన్ అయిన జాన్సన్ అండ్ జాన్సన్ టీకా పనిచేస్తుందని సీడీసీ డైరక్టర్ రోషెల్లా వాలెన్స్కీ తెలిపారు.
ఇదీ చూడండి:'ఫిబ్రవరి చివరి నాటికి 10 కోట్ల మందికి టీకా'