ఉగ్రమూకలపై పాకిస్థాన్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భారత్-అమెరికా ఉమ్మడి ప్రకటన చేశాయి. ఉగ్రకార్యకలాపాలకు పాల్పడే ముష్కరమూకలు తమ అధీనంలో లేవని ప్రపంచానికి భరోసా కల్పించాలని సూచించాయి. 26/11 ముంబయి, పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దాడులకు పాల్పడిన ముష్కరులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వెల్లడించాయి.
ఈనెల 9-10న వర్చువల్‌గా జరిగిన భారత్-అమెరికా ఉగ్రవాద నిరోధక ఉమ్మడి కార్యాచరణ బృందం 17వ సమావేశం, భారత్-యూఎస్ అధికారుల మూడోభేటీ సందర్భంగా ఈ మేరకు ఉమ్మడి ప్రకటన జారీ చేశాయి. ఉగ్రమూకలతో దాడులు, సరిహద్దు ఉగ్రవాదానికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించాయి ఇరు దేశాలు.
ఈ సమావేశానికి భారత్ తరఫున విదేశాంగ శాఖ తీవ్రవాద నిరోధక సంయుక్త కార్యదర్శి మహవీర్ సింఘ్వీ నేతృత్వం వహించగా.. అమెరికా తరఫున ఆ దేశ ఉగ్రవాద నిరోధక విభాగం సమన్వయ కర్త నతన్ సేల్స్ పాల్గొన్నారు. తీవ్రవాద నిర్మూలనలో సహకారం, ఈ అంశంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో సమన్వయాన్ని కొనసాగించాలని సంకల్పించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరులో భారత ప్రభుత్వం, ప్రజలకు అమెరికా మద్దతు ఎప్పుడూ ఉంటుందని మరోమారు ఉద్ఘాటించింది అగ్రరాజ్యం.
ఐరాస భద్రతా మండలి ఆంక్షల జాబితాలోని ఉగ్రమూకల నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై చర్చించారు అధికారులు. అల్‌ఖైదా, ఐసిస్, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హక్కానీ నెట్వర్క్, హిజ్బుల్ ముజాహిదీన్, తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ వంటి ఉగ్రసంస్థలపై చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
పాక్ హింసను ప్రోత్సహిస్తూనే ఉంది: భారత్
సరిహద్దుల్లో, దేశంలో పాక్ హింసను ప్రోత్సహిస్తూనే ఉందని పేర్కొంది భారత్. పాక్‌లో మానవహక్కుల ఉల్లంఘన, మైనారిటీలపై వివక్ష నివేదికలు ప్రపంచ మానవాళిపై ఆందోళన పెంచుతున్నాయని వెల్లడించింది. పాకిస్థాన్ ఇటీవల ఐరాస వేదికగా భారత్‌పై బురదజల్లే ప్రయత్నం చేసిందని గుర్తుచేశారు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పాలోమి త్రిపాఠి. ఐరాస 74వ సాధారణ సమావేశంలో భాగంగా ప్రపంచ శాంతిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సదస్సులో ఈ మేరకు పాక్ చర్యలను ఎండగట్టారు త్రిపాఠి.
ఇదీ చూడండి: లద్దాఖ్‌లో శాంతిని నెలకొల్పడం ఎలా?