ఒకే వ్యక్తి రెండు సార్లు ఓటేయాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి చట్టవిరుద్ధ కార్యకలాపాల్ని ప్రోత్సహిన్నారంటూ ఆయన ప్రత్యర్థి వర్గం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ప్రజలు మెయిల్-ఇన్ పద్ధతిలో ఓటు నమోదు చేసుకున్న తర్వాత మరోసారి పోలింగ్ కేంద్రానికి వెళ్లి కూడా ఓటు వేయాలని సూచిస్తూ.. ఓ ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు ట్రంప్. ఒకవేళ ఓ వర్గం వాదిస్తున్నట్లు మెయిల్-ఇన్ పద్ధతి సమర్థమైనదే అయితే.. పోలింగ్ కేంద్రంలో వేసిన ఓటు తిరస్కరణకు గురికావాలని వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా వ్యతిరేకత..
దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అధ్యక్షుడు అధికారికంగా చట్టవిరుద్ధ కార్యకమాల్ని ప్రోత్సహిస్తున్నారని విరుచుకుపడ్డారు. కరోనా విజృంభణ నేపథ్యంలో అమెరికాలో చాలా మంది ఓటర్లు మెయిల్-ఇన్ పద్ధతికి మొగ్గుచూపారు. ఈ విధానాన్ని ట్రంప్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల మోసం జరిగే అవకాశం ఉందని వాదిస్తున్నారు.
దిద్దుబాటు చర్యలు..
ఒక ఎన్నికలో ఒకేవ్యక్తి రెండుసార్లు ఓటేయడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అలా చేసేందుకు ప్రోత్సహించిన వారికి కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడం వల్ల ట్రంప్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ఆయన వ్యాఖ్యల్ని సవరించుకుంటూ గురువారం వరుస ట్వీట్లు చేశారు.
నవంబరు 3న ఉదయం వీలైనంత త్వరగా మెయిల్-ఇన్ పద్ధతిలో ఓటు వేయాలని కోరారు. ఒకవేళ అది నమోదు కాకుంటే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేయాలని సూచించారు. ఇలా రెండుసార్లు ఓటేయాలన్న తన వ్యాఖ్యల్ని పరోక్షంగా సవరించుకునే ప్రయత్నం చేశారు. ఈ వివాదంపై స్పందించిన వైట్ హౌస్ సైతం ఇదే తరహా వివరణ ఇచ్చింది. ట్రంప్ చట్టవిరుద్ధ కార్యక్రమాల్ని ప్రోత్సహించలేదని పేర్కొంది.
ఇదీ చదవండి: బైడెన్ మాస్కు ధరించే విధానంపై ట్రంప్ ఎగతాళి