అంతర్జాతీయ సంస్థలైన ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్యనిధిలో సంస్కరణలు అత్యావశ్యకమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ లారెన్స్ సమ్మర్స్తో సంభాషణలో పాల్గొన్న ఆమె.. సంస్కరణలు లేక పోవడం వల్ల చాలా దేశాల్లో దశాబ్దాలుగా అనేక సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పలు దేశాలు దశలవారీగా సంస్కరణలు తీసుకొస్తున్నా.. అంతార్జాతీయ సంస్థలు మాత్రం ఏళ్లు గడిచినా పాత విధానాలతోనే ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
" దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహించని దేశాల్లో వాణిజ్య, భద్రత, ద్రవ్య విధానం వంటి సమస్యలపై అంతర్జాతీయ సంస్థలు గళమెత్తడం లేదు. అభివృద్ధి కోసం నిధుల గురించి పట్టించుకోవడం లేదు. ఈ సంస్థల్లో సంస్కరణలు జరగడం అత్యవసరం. సరైన ప్రాతినిధ్యం దక్కని దేశాల కోసం గొంతెత్తే విధంగా ఈ సంస్థలు పారదర్శకతతో ఉండాలి. తక్షణమే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఉత్తర, దక్షిణ దేశాలకు సరైన న్యాయం జరగడం లేదు. ఆఫ్రికా, పసిఫిక్‌లోని అనేక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు. సంస్కరణలు జరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. "
-నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి
పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలకు గ్లోబట్ ట్యాక్స్ విధించే విషయాన్ని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ(OECD) పరిశీలిస్తున్నట్లు నిర్మల చెప్పారు. ఈ కంపెనీలు చాలా దేశాల్లో ఉన్నప్పటికీ ఎక్కడా ట్యాక్స్ చెల్లించకుండా భారీ లాభాలు ఆర్జిస్తున్నాయని వివరించారు. 2022 డిసెంబర్ 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతను భారత్ చేపడుతుందని నిర్మల అన్నారు. జీ-20 ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కృషి చేస్తుందని చెప్పారు
వారం రోజుల పర్యటన కోసం అమెరికాకు సోమవారం వెళ్లారు నిర్మల. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వార్షిక సమావేశంతో పాటు జీ-20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశాలకు హాజరుకానున్నారు. అమెరికా ట్రెజరీ సెక్రెటరీ జానెట్ యెలెన్తోనూ భేటీ కానున్నారు.
ఇదీ చదవండి: Satya Nadella: సత్య నాదెళ్లకు 'సీకే ప్రహ్లాద్' పురస్కారం