ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల(covid cases) సంఖ్య స్థిరంగా కొనసాగుతున్నట్లు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(World health organisation) తెలిపింది. గత రెండు నెలలుగా వారానికి దాదాపుగా 45 లక్షల కేసులు నమోదవుతున్నట్లు వెల్లడించింది. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో 20 శాతం, అమెరికాల్లో 8 శాతం కేసుల్లో పెరుగుదల ఉన్నట్లు తెలిపింది. మిగతా ప్రాంతాల్లో కేసులు ఒకే రీతిలో కొనసాగడం లేదా తగ్గుతుండటం కనిపిస్తోందని పేర్కొంది.
అమెరికా, ఇరాన్, భారత్(covid cases in india), బ్రిటన్, బ్రెజిల్ దేశాల్లో అధికశాతం కొవిడ్ కేసులు నమోదవుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదికలో పేర్కొంది. గతవారంలో.. ప్రపంచవ్యాప్తంగా 68,000 మంది కొవిడ్ కారణంగా మరణించారని తెలిపింది. యూరప్, అమెరికాలో మరణాల రేటు 10 శాతం పెరిగిందని వెల్లడించింది.
ఎమర్జెన్సీ పొడిగింపు..
జపాన్‌లో డెల్టా వేరియంట్(Delta variant) పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా.. ఆ దేశ ప్రభుత్వం ఎమర్జెన్సీ నిబంధనలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మరో ఎనిమిది ప్రాంతాల్లో ఎమర్జెన్సీ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. హొక్కైడో, మియాగి, ఐచ్చి, గిఫు, హిరోషియా, ఒకాయామ ప్రాంతాలు ఎమర్జెన్సీ జాబితాలో చేరినట్లు తెలిపింది.
తొలుత సెప్టెంబర్ 12 వరకు అత్యవసర పరిస్థితి కొనసాగనుందని ప్రకటించింది. రెస్టారెంట్లు, బార్లు రాత్రి 8 లోపు మూసివేయాలని, షాపింగ్ మాల్స్‌లో ప్రజలు గుమిగూడకుండా చూడాలని స్పష్టం చేసింది. టోక్యో, ఒకినావా సహా మరో 13 ప్రాంతాలకు ఎమర్జెన్సీ విస్తరించాలని నిర్ణయించింది. మిగిలిన ప్రాంతాల్లో పాక్షిక ఎమర్జెన్సీ ఉంటుంది.
మరో 12 వేల కేసులు..
న్యూయార్క్‌లో రాష్ట్ర ప్రభుత్వం చూపిన మరణాల కన్నా 12,000 మంది ఎక్కువగా కొవిడ్‌కు బలయ్యారని ఆ రాష్ట్ర గవర్నర్ కాతీ హోఛుల్ స్పష్టం చేశారు. ప్రజలకు నిజాలేంటో స్పష్టంగా తెలియాలని ఆమె అన్నారు. కొవిడ్ కట్టడిలో విఫలమైన కారణంగా గవర్నర్ ఆండ్రూ కువొమో ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు.
తమ రాష్ట్రంలో మంగళవారం 55,400 మంది కొవిడ్ కారణంగా మృతిచెందారని కాతీ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ సంఖ్య కువొమో చూపిన 43,300 కన్నా చాలా ఎక్కువ.
ఇదీ చదవండి:ఒక్కరోజే 7.23 లక్షల కరోనా కేసులు- ఆ దేశంలో ఎమర్జెన్సీ