కొవిడ్-19 మహమ్మారి కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మరణాలు సంభవించాయన్నారు ఐక్యరాజ్య సమితి అధినేత ఆంటోనియో గుటెరస్. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే వ్యాప్తి అత్యధికంగా ఉన్నట్లు చెప్పారు. అలాంటి దేశాలకు అవసరమైన భారీ, అత్యవసర సాయంపై ప్రపంచ దేశాలు సరైన సమయంలో స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా మహమ్మారి కట్టడికి వనరుల సమీకరణ కోసం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్లతో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు గుటెరస్.
" అమెరికా, కెనడా, యూరప్ వంటి చాలా అభివృద్ధి చెందిన దేశాలు.. కరోనా మహమ్మారి సంక్షోభం, దాని ప్రభావాన్ని తగ్గించేందుకు తమ జీడీపీలో రెండంకెల ప్యాకేజీలను ప్రకటించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా అదే విధంగా చేయటానికి వనరులను సమీకరించటమే ప్రధాన సమస్య. అంతర్జాతీయ ద్రవ్య నిధికి వనరులను పెంచాల్సిన అవసరం ఉంది. అనేక దేశాలకు అత్యవసరంగా రుణ ఉపశమనం అవసరం. ప్రస్తుత రుణాల రద్దు ప్రక్రియను సహాయం అవసరమైన అన్ని అభివృద్ధి చెందుతున్న, మధ్య ఆదాయ దేశాలకు విస్తరించాలి. క్రెడిట్-రేటింగ్ ఏజెన్సీలతో సహా ప్రైవేటు రంగం కూడా సహాయక చర్యల్లో నిమగ్నమవ్వాలి.
- ఆంటోనియో గుటెరస్, ఐరాస అధినేత
ప్రస్తుత సంక్షోభ సమయంలో సాయం చేసేందుకు 40 ప్రపంచ నాయకులు, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఆఫ్రికన్ యూనియన్ అధినేతలు ముందుకు రావాలని కోరారు గుటెరస్. 35 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు పిలుపునిచ్చారు. అందులో ఔషధాలు, చికిత్స, టీకాలు అన్ని దేశాలకు సమానంగా అందేందుకు తక్షణ సాయం కింద 15 బిలియన్ డాలర్లు అందించాలని కోరారు.
ఇదీ చూడండి: చౌకైన ఎంజైముతో కరోనా చికిత్స