డిజిటిల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సైబర్ నేరాలకు చెక్ పెట్టాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్.. అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, ఇతర సదుపాయాలపై అంతకంతకూ పెరిగిపోతున్న సైబర్ మోసాలను కొత్త మార్గాల ద్వారా అడ్డుకట్టవేయాలని సూచించారు.
కరోనా వ్యాప్తి ద్వారా ఇప్పటికే చాలా ఆర్థిక వ్యవస్థలు కుదేలవ్వడం సహా సమాజంపై అదనపు భారం పడుతోందని గుటెరస్ తెలిపారు. కొవిడ్ విజృంభణతో మరణాలు పెరగడమే కాకుండా.. పేద ప్రజలు తీవ్రమైన ఆకలితో అలమటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది దశాబ్దాల అభివృద్ధిని వెనక్కి నెడుతోందని పేర్కొన్నారు.
'ఆ డ్రోన్ల వినియోగంపై పునరాలోచించాలి'
వైరస్‌పై పోరాటంలో పౌరుల రక్షణను మరింత బలోపేతం చేయాలని గుటెరస్ పునరుద్ఘాటించారు. జాతీయ చట్టాలు, అంతర్జాతీయ చర్యల ద్వారా జవాబుదారీతనంలో ఉన్న అంతరాన్ని తొలగించాలని కోరారు గుటెరస్. లిబియా, యెమెన్ల సాయుధ పోరాటంలో డ్రోన్ల వినియోగంపై పునరాలించాలని సూచించారు. ప్రాణాంతక స్వయంప్రతిపత్తితో ఆయుధ వ్యవస్థలు అభివృద్ధి వల్ల ఎదురయ్యే చట్టపపరమైన, నైతిక చిక్కులను పరిష్కరించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేశారు గుటెరస్.
తీవ్రంగా దోపిడీ..
కొవిడ్-19 విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేసిన గుటెరస్.. మహమ్మారి ప్రపంచాన్ని తీవ్రంగా దోపిడీ చేస్తోందన్నారు. గతేడాది సాయుధ పోరాటం ఫలితంగా వేలమంది చిన్నారులు ఆకలితో అలమటించారని, లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ఆయన వివరించారు. అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ ద్వారా.. తప్పిపోయిన వారి కుటుంబాల నుంచి సుమారు 1.40లక్షల అభ్యర్థనలు అందాయని యూఎన్ చీఫ్ కౌన్సిల్‌కు తెలిపారు గుటెరస్.
ఇదీ చదవండి: ప్రపంచాన్ని ముంచేసిన 'వుహాన్' విందు