Ukraine Issue With Russia: ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా మండిపడింది. ఆ దేశంపై దురాక్రమణ చర్యలకు పాల్పడితే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మిత్ర దేశాలతో తాము చాలా సన్నిహితంగా వ్యవహరించడమే కాకుండా సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశాలపై దురాక్రమణకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.
"మేము మా భాగస్వామ్య దేశాలతో సన్నిహితంగా ఉండడంమే కాదు.. వివిధ అంశాలపై కూడా చర్చిస్తాము. ఉక్రెయిన్‌పై రష్యా తిరిగి దురాక్రమణ చర్యలకు పాల్పడితే.. అందుకు భారీ ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాటో, యూరోపియన్ యూనియన్, జీ7ల నుంచి వినిపిస్తున్న ప్రకటనలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వారి నుంచి కూడా రష్యాకు ధిక్కార స్వరం వినిపిస్తోంది."
- ఆంటోని బ్లింకన్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి
తమకు దౌత్యంతో పాటు ఎదుర్కొవడం కూడా తెలుసని బ్లింకన్ అన్నారు. గతంలో పుతిన్‌తో బైడెన్ సమావేశమైనప్పుడు ఇరుదేశాధినేతలు బలమైన బంధానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. అలా అని దానిని రష్యా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మా ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూస్తారని హెచ్చరించారు బ్లింకన్.
ఈ నెల ప్రారంభంలో బైడెన్, పుతిన్‌లు వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ క్రమంలో మాట్లాడిన బైడెన్ ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మిత్ర దేశాలు వాటికి గట్టి సమాధానమే చెప్తాయని స్పష్టం చేశారు.
అలా అయితే మేమూ తగ్గేదేలే...
అమెరికా స్పందనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్ విషయంలో అమెరికా ధోరణి మార్చుకోకపోతే తాము వెనక్కి తగ్గేది లేని అన్నారు. ఇప్పటికైనా అమెరికా దూకుడు ప్రవర్తనను విరమించుకోక పోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: పారాగ్లైడర్‌ను ఢీకొని కూలిన విమానం.. ఇద్దరు మృతి