"అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ.. అగ్రరాజ్య వైస్ ప్రెసిడెంట్ అయిన తొలి నల్లజాతీయురాలు".. ఇలా అసమాన స్థాయిలో గుర్తింపు పొంది వార్తల్లో నిలిచిన భారత సంతతి మహిళ కమలా హారిస్‌కు అనూహ్య రీతిలో ఓ సమస్య ఎదురైంది. ఆ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో ఎవరికీ తెలియకపోవడం మరింత కలవరపెడుతున్న విషయం. అయితే ఆ సమస్య వచ్చింది బాధ్యతల నిర్వహణలో కాదు.. అధికార నివాసం విషయంలో! అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు గడిచిపోయినా.. ఆమె ఇంకా అధికార నివాసంలోకి వెళ్లలేదు. ఎందుకు?
మరమ్మతులు...
అమెరికా రాజధాని వాషింగ్టన్లో.. అధ్యక్ష, ఉపాధ్యక్ష నివాసాలు ఉంటాయి. అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు జనవరి 20న ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేశారు కమల. అదే రోజున.. అధ్యక్షుడికి కేటాయించే అధికార నివాసం శ్వేతసౌధానికి వెళ్లిపోయారు బైడెన్. కానీ కమల మాత్రం.. తన భర్త డాగ్లస్ ఎమ్హోఫ్తో కలిసి.. రెండు నెలలుగా అధ్యక్షుడి అధికార అతిథి గృహమైన బ్లెయిర్ హౌస్‌లోనే ఉంటున్నారు. సూట్‌కేసుల్లో సర్దుకున్న వస్తువులనే వినియోగిస్తున్నారు.
ఇదీ చూడండి:- 'కమలం' విరిసింది.. తులసేంద్రపురం మురిసింది!
అయితే.. ఉపాధ్యక్షుల కోసం కేటాయించిన నివాసం(నావల్ అబ్జర్వేటరీ)లో మరమ్మతులు జరుగుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కానీ అవి ఎలాంటి మరమ్మతులు? అవి ఎప్పుడు పూర్తవుతాయి? అసలు రెండు నెలల సమయం ఎందుకు పట్టింది? వంటి ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానాలు కూడా లేవు.
అధికార రికార్డులను పరిశీలించిన ఓ అమెరికన్ వార్తా సంస్థ.. ఉపాధ్యక్షురాలి అధికార నివాసంలో ప్లంబింగ్, హీటింగ్, ఎయిర్ కండీషనింగ్‌కు సంబంధించి మరమ్మతులు జరుగుతున్నట్టు గుర్తించింది. కానీ.. అధికార నివాసంలోకి కమల వెళ్లకపోవడానికి ఇవేవీ సరైన కారణాలు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వంట గది కోసం!
మూడు వారాల క్రితం.. అక్కడికి వెళ్లిన కమలా హారిస్.. దాదాపు గంట సేపు ఆ నివాసంలో గడిపారు. సహజంగానే వంటలపై మక్కువతో ఉండే కమల.. ఆ ఇంట్లోని వంటగదిలో పలు మార్పులు చేయాలని సూచించినట్టు ఉపాధ్యక్షురాలి అధికార నివాస సిబ్బందిలో కొందరు తెలిపారు. అయితే అందుకు సంబంధించి మరమ్మతులేవీ జరగడం లేదని మరికొందరు వెల్లడించారు.
ఓవైపు ఈ వ్యవహారంపై కమల విసుగెత్తుపోతున్నారని.. అధికార నివాసానికి ఎప్పుడు వెళతానా అన్న ఆలోచన ఆమెలో రోజురోజుకు పెరిగిపోతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చూడండి:- 'వలసల' బాధ్యత కమలా హారిస్‌కు అప్పగింత