2015 నుంచి సంస్థ కల్పిస్తున్న పరిహారం, ప్రయోజనాలకు దూరంగా ఉంటున్న ట్విట్టర్ సీఈఓ(ముఖ్య కార్యనిర్వాహణాధికారి) జాక్ డోర్సే... 2018లో మాత్రం వేతనం అందుకున్నారు. ఆ మొత్తం ఎన్నో బిలియన్ డాలర్లు ఉంటుందనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. డోర్సే 1.4 డాలర్ల వేతనం మాత్రమే అందుకున్నారు. ఇదే విషయాన్ని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(ఎస్ఈసీ)కు తెలిపింది ట్విట్టర్ సంస్థ.
"ట్విట్టర్‌ను మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలనే నిబద్ధతతో... సంస్థ అందిస్తున్న పరిహారం, ప్రయోజనాలకు.. 2015, 16, 17లో దూరంగా ఉన్న సీఈఓ జాక్ డోర్సే 2018 లోనూ అదే పునరావృతం చేశారు. అయితే గతేడాది 1.4 డాలర్ల వేతనం మాత్రమే అందుకున్నారు."
- ట్విట్టర్
ఒక ట్వీట్‌కు గరిష్ఠంగా ఉండే 140 అక్షరాలకు చిహ్నంగా జాక్ డోర్సే 1.4 డాలర్ల వేతనం పుచ్చుకున్నారని అమెరికా మీడియా సంస్థ సీనెట్ తెలిపింది.
"బహుశా డోర్సే త్వరలో తన వేతనాన్ని రెండింతలు (2.8 డాలర్లు) చేయనున్నారేమో? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, డోర్సే ఈ మొత్తానికి అంగీకారం తెలిపే అవకాశాలున్నాయి. ఎందుకంటే ట్వీట్లోని 140 అక్షరాల పరిధిని 280కి పెంచేందుకు ట్విట్టర్ సిద్ధమవుతోంది."
- సీనెట్
డోర్సే... 16 మిలియన్ షేర్లు
ట్విట్టర్లో జాక్ డోర్సేకు 16 మిలియన్ షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం వీటి విలువ 557 బిలియన్ డాలర్లు ఉంటుంది.