కరోనా పేరు చెప్పి గ్రీన్‌కార్డుల మంజూరును నిలిపి వేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అదే రీతిలో హెచ్1బీ, ఇతర వీసాలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. అగ్రరాజ్య వలస విధానంలో మొదలైన ఈ మార్పులు నిజంగా తాత్కాలికమా? లేక ఎప్పటినుంచో తీసుకురావాలని భావిస్తున్న 'ట్రంప్ మార్క్ వలస విధానం' అమలుకు రంగం సిద్ధమవుతోందా? అంటే రెండోదే నిజం అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
అగ్రరాజ్యానికి వచ్చే విదేశీయుల సంఖ్యను భారీగా తగ్గించాలన్న దీర్ఘకాలిక లక్ష్య సాధనకు ఇది ఆరంభమని చెబుతున్నారు ట్రంప్ సలహాదారుడు స్టీఫెన్ మిల్లర్. ట్రంప్ ఇమిగ్రేషన్ అజెండాకు రూపకర్త ఆయనే కావడం విశేషం.
" వలసదారులను అడ్డుకోవడానికి కీలకమైన తొలి సంతకం చేసిన ట్రంప్ ఓ మిషన్ పూర్తిచేశారు. ఇది ఎక్కువ కాలానికే పరిమితం చేసే అవకాశాలున్నాయి. ఒక్కసారి అమెరికాలోకి అడుగుపెట్టేవారిని తగ్గిస్తే... ఆ చైన్ దెబ్బతిని భవిష్యత్తులోనూ ఉపాధి కోసం వచ్చేవారి సంఖ్య తగ్గుతుంది. దీర్ఘకాలంలో అమెరికా ప్రజలు ప్రయోజనం పొందుతారు."
--మిల్లర్, ట్రంప్ సలహాదారు
కుటుంబ సమేతంగా వచ్చే మూకుమ్మడి వలసల్ని అడ్డుకోవాలని ట్రంప్ ప్రభుత్వం.. చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది ఈ తరహాలో 4,60,000 మంది వీసాలు పొందారు. ఇప్పటికే ఉన్న ప్రతిభ ఆధారిత విధానం కంటే తాత్కాలిక గ్రీన్‌కార్డు మంజూరు నిలుపుదల వల్ల ఎక్కువ వలసలను నిరోధించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
అంత సులువు కాదు!
విదేశీయుల కారణంగా అమెరికన్ల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ట్రంప్ వర్గం బలంగా వాదిస్తున్నా... అధికార రిపబ్లికన్ పార్టీలోని ఆర్థికవేత్తలు, వ్యాపార అనుకూల నేతల ఆలోచన మరోలా ఉంది. వలసదారుల వల్లే అమెరికా అభివృద్ధి సాధిస్తోందని, సంస్థల్లో పోటీతత్వం పెరిగిందన్నది వారి వాదన. ఈ రెండు వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడం అధ్యక్షుడికి అసలు సమస్య. వలస విధానంపై ప్రతిపక్ష డెమొక్రాట్ల వ్యతిరేకత సంగతి సరేసరి. ఈ సవాళ్లను అధిగమించి, వీసా నిబంధనల కఠినతరం విషయంలో ట్రంప్ అనుకున్నది చేయగలరా లేదా అన్నదే ప్రశ్న.