కొవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో దారుణంగా విఫలమయ్యారనే విమర్శలు ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్ త్వరలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడం తథ్యమని ప్రజాభిప్రాయ సేకరణలు ఘోషిస్తున్నాయి. గత నాలుగు దశాబ్దాలుగా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేస్తున్న విఖ్యాత చరిత్రకారుడు అలాన్ లిక్ట్ మాన్ ఈసారి ట్రంప్ పరాజయం పాలవడం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఈ మేరకు ఆయన రాసిన పరిశోధన పత్రం ఇటీవల ది న్యూయార్క్ టైమ్స్ దిన పత్రికలో ప్రచురితమైంది. వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ విశ్వవిద్యాలయ ఆచార్యుడైన లిక్ట్ మాన్ అధ్యక్ష ఎన్నిక ఫలితాల అంచనా కోసం రూపొందించిన 13 పరామితుల ఫార్ములా ట్రంప్ ఓటమిని ఘంటాపథంగా చాటిచెబుతోంది. రియల్ క్లియర్ పాలిటిక్స్ న్యూస్ సైట్ సమాచారం ఆధారంగా ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కు 308 ఎలక్టోరల్ కాలేజ్ (నియోజక గణ) ఓట్లు వస్తే, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 113 ఓట్లతో సరిపెట్టుకోవలసి వస్తుందని అంచనా కట్టింది. 538 నియోజక గణ ఓట్లలో కనీసం 270 ఓట్లు సాధించగలవారే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. అమెరికన్ ప్రజల్లో అత్యధికులు తనకే మద్దతు ఇస్తున్నారని, అయితే వారు ఎన్నికల తేదీ వరకు మౌనంగా ఉండి పోలింగ్ రోజు తడాఖా చూపుతారని ట్రంప్ నమ్ముతున్నారు. ఈ మౌన మెజారిటీ అండతో తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికవుతానని బల్లగుద్ది చెబుతున్నారు.
చాపకింద నీరులా వ్యతిరేకత
లిక్ట్ మాన్ నమూనాలో 13 పరామితులు ఉంటాయి. అవి: మధ్యంతర ఎన్నికల్లో విజయాలు; పాలక పార్టీ అభ్యర్థికి గట్టి పోటీ లేకపోవడం; అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి పాలక పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం; రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు కాకుండా బలమైన తృతీయ పక్షం నుంచి కానీ, లేదా స్వతంత్ర అభ్యర్థి నుంచి కానీ పోటీ లేకపోవడం; ఎన్నికల సమయంలో ఆర్థిక మాంద్యమేమీ లేకపోవడం; అంతకుముందు ఇద్దరు అధ్యక్షుల పదవీకాలంలో కన్నా ప్రస్తుత అధ్యక్షుడి పాలనలో ప్రజల వాస్తవ తలసరి ఆదాయం మిన్నగా ఉండటం; ప్రస్తుత అధ్యక్షుడి ప్రభుత్వం జాతీయ విధానాల్లో ప్రధాన మార్పులు చేసి ఉండటం; సామాజిక అశాంతి లేకపోవడం; ప్రస్తుత అధ్యక్షుడు ఎటువంటి కుంభకోణాల్లో ఇరుక్కుపోకుండా నిష్కళంకుడిగా ఉండటం; విదేశాంగ విధానపరంగా కానీ, సైనికంగా కానీ ప్రస్తుత అధ్యక్షుడు ఎలాంటి వైఫల్యాలు ఎదుర్కోకపోవడం; ప్రస్తుత అధ్యక్షుడు విదేశాంగ, సైనికపరంగా గణనీయ విజయాలు సాధించడం; పాలక పార్టీ అభ్యర్థి జనసమ్మోహన శక్తితో జాతీయ హీరోగా ఖ్యాతికెక్కడం; ప్రతిపక్ష అభ్యర్థికి అలాంటి సమ్మోహన శక్తి కానీ, జాతీయ హీరోగా గుర్తింపు కానీ లేకపోవడం. ఈ 13 పరామితులకు అవును లేదా కాదు అని సమాధానాలు చెప్పుకొన్నప్పుడు, ఆరుకన్నా ఎక్కువ పరామితులకు ‘కాదు’ అని జవాబు వస్తే, ప్రస్తుతం పదవిలో ఉన్న అధ్యక్షుడికి రేపటి ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలిపోతుంది. ట్రంప్ భవిష్యత్తు ఇదేనని లిక్ట్ మాన్ ఫార్ములా చెబుతోంది. ఈ ఫార్ములా ప్రకారం ట్రంప్‌నకు ఏడు పరామితుల్లో ప్రతికూల ఫలితం వచ్చింది. అవి: మధ్యంతర ఎన్నికల్లో ఓటమి, స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రతికూల పరిస్థితులు, సామాజిక అశాంతి, కుంభకోణాల సెగ, విదేశాంగపరంగా, సైనికంగా విజయాలు లేకపోవడం, జనసమ్మెహన శక్తి లోపించడం. ట్రంప్ ఎదుర్కొంటున్న ఈ ప్రతికూలతలు ప్రతిపక్ష ప్రత్యర్థి జో బైడెన్‌కు సానుకూలతలుగా పరిణమించి, ఎన్నికల్లో విజయానికి తోడ్పడతాయని లిక్ట్ మాన్ జోస్యం చెప్పారు.
రాజకీయ భూకంపం
అధ్యక్ష ఎన్నికల ప్రచారం వల్ల ఫలితాలేమీ మారవని లిక్ట్ మాన్ ఫార్ములా తెలుపుతోందని భారత్-అమెరికా రాజకీయ కార్యాచరణ సంఘం సంస్థాపక సభ్యుడు రవీందర్ సచ్ దేవ్ వివరించారు. అమెరికన్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి అయిన సచ్ దేవ్ అక్కడ లిక్ట్ మాన్ వద్ద శిష్యరికం చేశారు. దీని ఆధారంగా ఎన్నికల్లో ప్రజా తీర్పును ఆయన కచ్చితంగా అంచనా వేయగలుగుతున్నారని సచ్ దేవ్ వివరించారు. ఈ ఫార్ములాలోని 13 పరామితుల్లో ఒక్కటి మాత్రమే స్వల్పకాలికమైనది. అది- ఎన్నికల సమయంలో ఆర్థిక మాంద్యమేమీ లేకపోవడం. మిగతా 12 పరామితులు దీర్ఘకాలికమైనవి. ఆసక్తికరమేమంటే, లిక్ట్ మాన్ నాలుగు దశాబ్దాల క్రితం రష్యన్ భూకంప శాస్త్రజ్ఞుడు వ్లాదిమిర్ కెలిస్ బొరోక్‌తో జరిపిన సంప్రదింపుల ఆధారంగా తన నమూనాను రూపొందించారు. ఇంతకీ భూకంపాలకు, రాజకీయాలకు సంబంధం ఏమిటంటారా? భూకంపానికి భూమి పొరల్లో వచ్చే మార్పులు ఎలా కారణమవుతాయో, సమాజంలో ముందుగానే పొడచూపే ధోరణులు రాజకీయంగా భూకంపం సృష్టిస్తాయని లిక్ట్ మాన్ సూత్రీకరణ. స్వతహాగా డెమోక్రటిక్ పార్టీని అభిమానించే లిక్ట్ మాన్, ఈ ఫార్ములా ఆధారంగానే 2016 ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ట్రంప్ గెలుపును కచ్చితంగా అంచనా వేశారు. ఈ విషయాన్ని ముందుగా పసిగట్టడంలో పలు ప్రజాభిప్రాయ సర్వేలు విఫలమయ్యాయి. అదే లిక్ట్ మాన్ ఈసారి ట్రంప్ ఓటమి తథ్యమని తీర్మానించడం తేలిగ్గా తీసివేయాల్సిన అంశం కాదు.
- అరుణిం భుయాన్(రచయిత- విదేశాంగ వ్యవహారాల నిపుణులు)