అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య తొలి సంవాదం జరిగింది. అరోగ్య వ్యవస్థ అంశంలో అడిగిన ప్రశ్నపై ఇద్దరు పరస్పర విమర్శలు చేసుకున్నారు. మాజీ అధ్యక్షుడు బారాక్ ఒబామా తీసుకొచ్చిన ఒబామా కేర్‌ను రద్దు చేసిన విషయం ప్రధానంగా చర్చకు వచ్చింది.
ఒబామా కేర్‌ను రద్దు చేసి కొత్త ఆరోగ్య విధానాన్ని కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా 5 రోజుల క్రితం ప్రవేశపెట్టారు ట్రంప్. ఇది ఎంతవరకు సరైందని నిర్వాహకులు ప్రశ్నించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నవారికి చికిత్స కోసం ప్రత్యేక పథకం తెచ్చామని చెప్పారు.
ఆరోగ్యబీమా రద్దు చేయలేదని, తక్కువధరలో అందించేందుకు ప్రయత్నించామని వివరించారు ట్రంప్. ఒబామా కేర్‌ను ఎలా నిర్వహించాలనేది పెద్ద ప్రశ్నగా మారిందని ఆరోపించారు. ఒబామా కేర్ నిర్వహణ చాలా ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిందని తెలిపారు. నేను అబద్ధాలు చెప్పడం లేదని, బైడెన్ చెప్పేవే అసత్యాలని విమర్శించారు.
అంతకుముందు ఒబామా కేర్‌ను రద్దు చేయటంతో ప్రజలు ఇబ్బందిపడ్డారని బైడెన్ విమర్శలు చేశారు. వైద్య, ఆరోగ్య విధానంపై ట్రంప్‌కు సమగ్ర ప్రణాళిక లేదని ఆరోపించారు.
చర్చలో మొదటి అంశంగా అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో ఇటీవల వచ్చిన ఆరోపణలు, విమర్శలపై మొదటి ప్రశ్న సంధించారు నిర్వహకులు.