అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రటిక్ సభ్యులు ప్రవేశపెట్టిన అభిశంసనతో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా డెమొక్రాట్ నాయకుడు, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి జో బిడెన్‌పై తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్. బిడెన్, ఆయన కుటుంబం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. దీనిని ఆపాలని సూచిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
ఉక్రెయిన్ సంస్థల్లోని అవినీతి నుంచి ఆయన కుమారుడు హంటర్‌ను రక్షించేందుకు బిడెన్ కలగజేసుకుంటున్నారని పేర్కొన్నారు ట్రంప్. ఎలాంటి అనుభవం లేని రంగంలో చైనా సంస్థలతో ఒప్పందం చేసుకుని సుమారు 1.5 బిలియన్ డాలర్ల మేర లబ్ధి పొందారని ఆరోపించారు.
కుట్ర సిద్ధాతాలు పనిచేయవు..
ట్రంప్ ఆరోపణలను తిప్పకొట్టారు బిడెన్. తనపై అబద్ధాలు వ్యాప్తి చేయాలని ట్రంప్ చూస్తున్నారని ఆరోపించారు. తనతో పాటు ఆయన కుటుంబంపై కుట్రలు పన్నుతున్నారని.. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కానీ తనపై కుట్ర సిద్ధాంతాలు పని చేయవన్నారు. అమెరికా ప్రజలకు తన గురించి, ట్రంప్ గురించి తెలుసునన్నారు. దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేసినట్లు తెలిపారు బిడెన్. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: కేన్సస్ బార్లో మళ్లీ కాల్పులు- నలుగురు మృతి