అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే నవంబర్ 3న భారీ స్థాయిలో పార్టీ నిర్వహించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారని ఓ ప్రముఖ వార్తా పత్రిక పేర్కొంది. వాషింగ్టన్‌లోని తన హోటల్లో రాత్రి వేళ ట్రంప్ ఈ పార్టీ ఇవ్వనున్నారని వెల్లడించింది. అయితే వాషింగ్టన్లో సామూహిక కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో.. ట్రంప్ నిర్ణయం వల్ల అక్కడి డెమొక్రటిక్ మేయర్‌తో విబేధాలు తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.
శ్వేతసౌధంలో జరిగే కార్యక్రమాలపై వాషింగ్టన్ నగర యంత్రాంగానికి పెద్దగా సంబంధం లేకపోయినా.. ఎలక్షన్ రోజు రాత్రి జరిగే కార్యక్రమానికి ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్‌ను వేదికగా ఎంచుకోవడాన్ని మేయర్ వ్యతిరేకించే అవకాశం ఉంది.
ట్రంప్ హోటల్‌పై చర్యలు
కరోనా మహమ్మారి కారణంగా వాషింగ్టన్లో 50 మందికి మించి ఒకచోట చేరకుండా ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో నగర మేయర్ మురియెల్ బౌసర్ స్పందించారు. ఈ కార్యక్రమం ఏర్పాట్ల విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ట్రంప్ హోటల్‌పై చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
ట్రంప్, బౌసర్ మధ్య ఇదివరకు చాలా విషయాల్లో విభేదాలు ఏర్పడ్డాయని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. కరోనా బాధితులను గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ విధానం పాటించడంలో వీరి మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయని వెల్లడించింది. జార్జ్ ఫ్లాయిడ్ మృతి సందర్భంగా నిరసనలు అదుపు చేసేందుకు సైన్యాన్ని పంపిస్తానని ట్రంప్ ప్రకటించడంపైనా వివాదం చెలరేగిందని పేర్కొంది.