వలసదారులపై ప్రభావం చూపే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆరోగ్య బీమా లేకపోవటం, వైద్య ఖర్చుల్ని భరించే స్తోమత లేని వలసదారులను దేశంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ట్రంప్.
అమెరికా ఆరోగ్య పరిరక్షణ విధానానికి భంగం కలిగించబోమని నిరూపించే వారికి మాత్రమే వీసాలు జారీ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనలు నవంబరు 3వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయని శ్వేతసౌధం వర్గాలు ప్రకటించాయి.
అక్రమ వలసల నిరోధం
వీసాకు దరఖాస్తు చేసుకునే వలసదారులు 30 రోజుల్లోగా ఆరోగ్య బీమా తీసుకోవాలి. లేదా ఆరోగ్య ఖర్చుల్ని భరించగలమన్న భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో వారి వీసాను తిరస్కరిస్తారు. అక్రమ వలసదారుల్ని అడ్డుకొని.. అమెరికా పౌరులకు మెరుగైన వైద్య సేవల్ని అందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : పీఓకే కశ్మీరీలు నియంత్రణరేఖ దాటొద్దు: ఇమ్రాన్