అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయనకు వరుస రోజుల్లో నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌గా తేలిందని శ్వేతసౌధ వైద్యుడు సీన్ కాన్లే తెలిపారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెలీ మెకెననీకి ఈ మేరకు సోమవారం(అమెరికా కాలమానం ప్రకారం) లేఖ రాశారు.
"అధ్యక్షుడు ఆరోగ్యంపై మీరు(శ్వేతసౌధ కార్యదర్శి) అడిగిన సమాచారం పంచుకోగలను. అబాట్ బైనాక్స్నౌ యాంటీజెన్ కార్డ్ ద్వారా వరుస రోజుల్లో నిర్వహించిన పరీక్షలలో అధ్యక్షుడికి కరోనా నెగెటివ్‌గా తేలింది."
-సీన్ కాన్లే, వైట్‌హౌస్ డాక్టర్
ఈ ఫలితం కోసం ఒక్క పరీక్షతోనే నిర్ధరణకు రాలేదని సీన్ కాన్లే పేర్కొన్నారు. వరుస యాంటీజెన్ పరీక్షలు, ఆర్ఎన్ఏ పీసీఆర్ సమాచారం, క్లినికల్-ల్యాబరేటరీ డేటా వంటి ఇతర మార్గాల్లోనూ నిర్ధరించుకున్నట్లు స్పష్టం చేశారు. వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) మార్గదర్శకాల ప్రకారం పరిశీలిస్తే అధ్యక్షుడు ఇతరులకు కరోనా వ్యాప్తి చేసే ప్రమాదం లేదని పేర్కొన్నారు.