అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు ఉన్నాయంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం కోర్కుకెక్కింది. పెన్సిల్వేనియా, మిషిగన్లలో ఫలితాలపై ఆయా రాష్ట్రాల్లోని న్యాయస్థానాల్లో దావా వేసినట్లు తెలిపింది. లెక్కింపు జరిగే ప్రాంతాల్లో నిపుణులైన పరిశీలకులను నియమించేందుకు అనుమతించాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే తెరిచిన బ్యాలెట్ ఓట్ల పరిశీలనకు అనుమతించే వరకు ఈ రెండు రాష్ట్రాల్లో కౌంటింగ్ తాత్కాలికంగా నిలిపివేయాలని ట్రంప్ బృందం కోరింది.
రీకౌటింగ్...?
విస్కాన్సిన్లో రీకౌంటింగ్ చేపట్టాలని డిమాండ్ చేసింది డొనాల్డ్ ట్రంప్ బృందం. విస్కాన్సిన్లోని పలు కౌంటీలలో అవకతవకలు ఉన్నాయని ఆరోపించింది. అదే సమయంలో పెన్సిల్వేనియాలో ఎన్నికలు పూర్తయిన మూడు రోజుల తర్వాత వచ్చిన ఓట్లు కూడా లెక్కించవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని ట్రంప్ ప్రచార డిప్యూటీ మేనేజర్ జస్టిన్ క్లార్క్ పేర్కొన్నారు.
పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. అయితే మెయిల్ బ్యాలెట్లు లెక్కిస్తున్న నేపథ్యంలో మెజారిటీ క్రమంగా పడిపోతోంది. పెన్సిల్వేనియాలో బ్యాలెట్ల విషయంలో మోసాలు జరిగిన ఘటనలేవీ బయటపడలేదు. ఈ రాష్ట్రంలో 31 లక్షల మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. ఎలక్షన్ డే(నవంబర్ 3) వరకు మార్క్ చేసిన బ్యాలెట్లను.. శుక్రవారం వరకు లెక్కించనున్నారు.
'మేం సిద్ధం'
అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ప్రచార బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో న్యాయ ప్రక్రియను ఎదుర్కొనేందుకు సిద్ధమేనని తెలిపింది. మిషిగన్లో ట్రంప్ వేసిన దావా గెలుపొందే అవకాశాలు లేవని ఆ రాష్ట్ర వర్గాలు స్పష్టం చేశాయి.
"మిషిగన్ ఫలితాలు డెమొక్రాట్లకు అనుకూలంగా ఉన్నాయని అసోసియేటెడ్ ప్రెస్, ఇతర మీడియా సంస్థలు పేర్కొనడాన్ని అడ్డుకునేందుకే ట్రంప్ ఈ దావా వేశారు. ఇదో విఫల ప్రయత్నం."
-లోనీ స్కాట్, ప్రోగ్రెస్ మిషిగన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
పెన్సిల్వేనియా, నెవడాలోని అబ్సెంటీ ఓట్ల విషయంలోని పలు సమస్యలపైనా న్యాయ పోరాటానికి రిపబ్లికన్లు సిద్ధమవుతున్నారు.
ఇదీ చదవండి- 6 అడుగుల దూరంలో బైడెన్- న్యాయపోరాటానికి ట్రంప్