అమెరికాలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలను తాను అంగీకరించట్లేదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రత్యర్థి జో బైడెన్(డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి) ఇందులో చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు ట్రంప్. ఈ మోసాన్ని ఖండించాలని కోరుతూ.. వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్.
'ర్యాడికల్ లెఫ్ట్ డెమొక్రాట్లు దొంగలించిన ఈ ఎన్నికల విజయాన్ని చూసేందుకు మేము ఇష్టపడం. నకిలీ ప్రసార మాధ్యమాల ద్వారా వారు మా విజయాన్ని తస్కరించారు. వారేం చేశారో? ఏం చేస్తున్నారో? అలాంటివేవీ జరగవు. ఈ ఓటమిని మేము అంగీకరించేది లేదు.' అని ఎన్నికల ఫలితాలకు నిరసనగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల సమక్షంలో అన్నారు ట్రంప్.
ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల లెక్కింపు, ధ్రువీకరించేందుకు కాంగ్రెస్ సంయుక్త సమావేశానికి కొద్ది గంటల ముందు ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. సుమారు గంటకుపైగా సాగిన సుదీర్ఘ ప్రసంగంలో.. ఈ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించామని పునరుద్ఘాటించారు ట్రంప్.
ఇదీ చదవండి: యూఎస్ కాంగ్రెస్ వద్ద తుపాకుల మోత