ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఇటీవలే అనేక వార్తలు వినిపించాయి. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కిమ్ ఆరోగ్యంపై వస్తోన్న కథనాలన్నీ అవాస్తవమని పేర్కొన్నారు.
అమెరికాలో కరోనా వ్యాప్తి గురించి వివరించే క్రమంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు ట్రంప్. ఇవన్నీ మీడియా సంస్థలు సృష్టించిన వార్తలని తెలిపారు.
కిమ్ ఆరోగ్యం బాగానే ఉందని అనుకుంటున్నా. మేమిద్దరం ఇప్పటికే ఎంతో సఖ్యత కలిగి ఉన్నాం. ఒకవేళ నేను అధ్యక్షుడిగా ఎన్నికవ్వకుండా ఉంటే.. ఉత్తరకొరియాతో మనకు యుద్ధ వాతావరణం నెలకొని ఉండేది. ఆ దేశంతో మాకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి.
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అధిక ధూమపానం, ఊబకాయం కారణంగా కిమ్ అస్వస్థతకు గురై, ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆ ఆపరేషన్ తర్వాత ఆయన ఆరోగ్యం విషమించిందన్న ఊహాగానాలు వినిపించాయి. వీటిలోని నిజానిజాల్ని తేల్చేందుకు అమెరికా నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.