ప్రపంచంలోనే కరోనా కేసుల్లో మొదటి స్థానంలో ఉంది అమెరికా. దీనికి అక్కడి ప్రజల నిర్లక్ష్యమూ ఓ కారణమని తెలుస్తోంది. దీనికి తోడు స్వయానా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజాగా.. మాస్కులు ధరించడంపై ఆదేశాలు ఇవ్వబోనని పునరుద్ఘాటించారు ట్రంప్. తమ దేశ ప్రజలకు స్వేచ్ఛ ఉందని... అందుకే మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని పేర్కొన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ ధరించడంపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు అమెరికా వైద్య నిపుణులు డాక్టర్ ఆంథోని ఫౌచీ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
'ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తే అన్ని సమస్యలు పరిష్కారమైపోతాయని నేను అనుకోను' అని ఫాక్స్ న్యూస్ సండేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు. మాస్క్ ధరించడం వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు ట్రంప్.
ఇటీవలే కరోనా సంక్షోభంలో తొలిసారిగా మాస్క్ ధరించి దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు అమెరికా అధ్యక్షుడు. వాల్టర్ రీడ్ వైద్య కేంద్రంలో మిలిటరీ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన ఆయన.. మాస్క్ వేసుకున్నారు.
ఇదీ చూడండి: కరోనాతో ప్రపంచం గజగజ.. 6 లక్షలు దాటిన మరణాలు