అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఈనెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అండ్రూ జాన్సన్ తర్వాత నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారానికి గైర్హాజరవుతున్న అగ్రరాజ్యం అధ్యక్షునిగా ట్రంప్ నిలవనున్నారు .
"నన్ను అడిగిన అందరికీ చెబుతున్నా, జనవరి 20న జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవానికి నేను హాజరుకాను."
-ట్రంప్ ట్వీట్
అధ్యక్షపదవి నుంచి తప్పుకునే ముందు చివరి గంటలు ఎలా గడుపుతారనే విషయంపై ఇప్పటివరకూ ట్రంప్ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఆయన ప్రణాళికలు ఎలా ఉన్నా జనవరి 20 మధ్యాహ్నం అగ్రరాజ్యం 46వ అధ్యక్షునిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
తన పదవీ కాలం త్వరలోనే ముగుస్తుందని గురువారం వీడియో సందేశం ద్వారా తెలిపారు ట్రంప్. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన బైడెన్ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.