శాస్త్రవేత్తలు నివ్వెరపోయే సలహాలిచ్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ సలహా ఓ జోక్ మాత్రమేనన్నారు. శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనంపై కావాలనే తాను వ్యంగ్యంగా స్పందించానని స్పష్టం చేశారు.
"నేను ఊరికే వెటకారంగా అడిగాను. అలా అంటే ఏమంటారా అని చూశానంతే. ఇక క్రిమిసంహారకాలు చేతులపై ఉండే క్రిములను నాశనం చేస్తే.. ఉపయోగకరంగానే ఉంటుంది కదా. సూర్యరశ్మి, క్రిమిసంహారకాలు చేతులపై పని చేయవా అని కాస్త వ్యంగ్యంగా అడిగానంతే."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ట్రంప్ ఏమన్నారంటే..
అధ్యయనాలను తనదైన ప్రశ్నలతో ఎప్పుడూ సవాలు చేస్తుంటారు ట్రంప్. ఆ దేశ శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనంపై స్పందించారు..
'వేసవిలో కరోనా వైరస్ బలహీనమవుతుందని అధ్యయనంలో తేలిందిగా.. శరీరంలోకి శక్తిమంతమైన సూర్య కాంతిని పంపించండి' అంటూ శాస్త్రవేత్తలకు సలహా ఇచ్చారు.
అంతంటితో ఆగకుండా ఉపరితలంపై కరోనాను క్షణాల్లో నాశనం చేసే బ్లీచ్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ వంటి క్రిమిసంహారకాలను నేరుగా శరీరంలోకి పంపించేయండి అన్నారు.
ట్రంప్ చెప్పినట్టు క్రిమిసంహారకాలు శరీరంలోకి వెళితే ప్రమాదమని వైద్యులతో పాటు డెటాల్, లైజాల్ వంటి సంస్థలు హెచ్చరించాయి. దీంతో.. ఆ మాటలన్నీ తన జోక్‌లో భాగమేన్నారు ట్రంప్.
ట్రంప్ హర్ట్ అయ్యారు!
తనపై వచ్చిన వెటకారపు శీర్షికలు చూసిన తర్వాత.. ట్రంప్ హర్ట్ అయినట్లు తెలుస్తోంది. బహుశా అందుకే, శ్వేతసౌధంలో కరోనాపై రోజువారీ పత్రికా సమావేశంలో.. తొలిసారి విలేకరుల ప్రశ్నలకు తావు ఇవ్వకుండా సమావేశం ముగించారని వార్తలు వినిపిస్తున్నాయి.
ట్రంప్ వ్యాఖ్యలు సర్వత్రా విమర్శలకు దారితీసిన నేపథ్యంలో శ్వేతసౌధం అప్రమత్తమైంది. కరోనాకు సంబంధించిన మీడియా సమావేశాల్లో అధ్యక్షుడి పాత్రను పరిమితం చేయడంపై తర్జనభర్జన పడుతోంది.
ట్రంప్ తరచూ మీడియా ముందుకు హాజరుకాకూడదని, ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే రావాలని ఇప్పటికే ఆయన సలహాదారులు సూచించారు. మిగతా రోజుల్లో మీడియా సమావేశాల బాధ్యతను ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు అప్పగించాలని చెప్పారు. ట్రంప్‌ను ఒప్పించి, ఈ సలహాలను అమలు చేయడంపై శ్వేతసౌధం అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.