అమెరికాలో నిందితులు లేదా నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు అవలంబించే 'చోక్‌హోల్డ్' అనే కఠిన పద్ధతికి స్వస్తి పలకాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇలాంటి విధానాన్ని ఉపయోగించొద్దని సూచించారు. ఇటీవల పోలీసుల కర్కశత్వానికి బలైన ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్‌పై అక్కడి అధికారి చోక్‌హోల్డ్ పద్దతిలోనే మెడపై కాలు పెట్టి నేలకేసి నొక్కారు. ఫలితంగా అతను ఊపిరాడక విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఈ విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలు ప్రముఖ నగరాల్లో దీనిపై నిషేధం విధించారు. 2014లో మరణించిన మరో నల్లజాతీయుడు ఎరిక్ గార్నర్‌పై కూడా నాటి పోలీసులు చోక్‌హోల్డ్‌నే ప్రయోగించారు.
ఓవైపు చోక్‌హోల్డ్ విధానానికి స్వస్తి పలకాలన్న ట్రంప్ మరోవైపు.. ప్రత్యేక పరిస్థితుల్లో నిందితులతో ఒంటరిగా తలపడాల్సి వచ్చినప్పుడు పోలీసులు ఈ విధానాన్ని అవలంబించాల్సి వస్తుందంటూ వత్తాసు పలికారు. మరోవైపు ఇటీవలి భారీ నిరసనలు, పోలీసు వ్యవస్థపై విమర్శలను వైట్ హౌస్ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. త్వరలోనే పోలీసు వ్యవస్థను ప్రక్షాళించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే కార్యనిర్వాహక ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీంట్లో చోక్‌హోల్డ్ నిషేధం అంశాన్ని చేరుస్తారా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో నమోదైన భూమి సగటు ఉష్ణోగ్రత