కరోనాబారిన పడి రెండు వారాల్లోపే కోలుకుని తిరిగి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వైరస్ నుంచి కోలుకున్నాక తొలిసారి ఫ్లోరిడాలో నిర్వహించిన ర్యాలీలో పూర్తి జోష్‌తో పాల్గొన్నారు. తాను ఇప్పుడు అత్యంత శక్తిమంతంగా ఉన్నానని, వీలైతే ర్యాలీకి హాజరైన ప్రతిఒక్కరికి ముద్దు పెట్టాలని ఉందని అన్నారు. ప్రసంగం మొదలు పెట్టడానికి ముందు మాస్కులను అభిమానులపైకి విసిరారు ట్రంప్.
బైడెన్‌పై తీవ్ర ఆరోపణలు..
డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్‌ను దక్కించుకునేందుకు జో బైడెన్ అవినీతికి పాల్పడ్డారని ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ నియంత్రణను సోషలిస్ట్, మార్క్సిస్ట్, వామపక్ష తీవ్రవాదులకు అప్పగించేందుకు అంగీకరించి బైడెన్ నామినేషన్ పొందారని ఆరోపించారు. ప్రస్తుతం జరిగే అధ్యక్ష ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత ముఖ్యమైనవన్నారు. అధ్యక్ష పోటీలో జో బైడెన్ తనకంటే చాలా వెనకబడి ఉన్నారని ఎద్దేవా చేశారు. బైడెన్ గెలిస్తే అమెరికాలోని పరిశ్రమలను మూసేస్తారని, దేశ సరిహద్దులను తెరిచి మన నగరాలను బైడెన్ ధ్వంసం చేస్తారని ట్రంప్ హెచ్చరించారు.
నేనే రైట్..
కరోనా కట్టడికి లాక్డౌన్ సరైన నిర్ణయం కాదని, దీని వల్ల ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుందని తాను గతంలో చెప్పిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంగీకరించిందని తెలిపారు ట్రంప్. డబ్ల్యూహెచ్ఓ రాయబారి డేవిడ్ నబారో ఇటీవల చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే లాక్డౌన్ ఉండాలని, దీని వల్ల ఆర్థికంగా పర్యటకంపై ఆధారపడే దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని డేవిడ్ అన్నారు.