అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై.. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా సోకిన నాటి నుంచి పూర్తి నిర్లక్ష్యంగా, అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అమెరికన్ల అవసరాలను విస్మరించి, వారిని తక్కువగా చూస్తున్నారని ఆరోపించారు.
లాస్వేగాస్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో బైడెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికన్లతో ఉంటూ వారి అవసరాలను అర్థం చేసుకోగలిగిన వారే అధ్యక్ష పదవికి అర్హులని వ్యాఖ్యానించారు.
"ఆయనను లేదా ఇతరులను రక్షించుకోవటానికి ట్రంప్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ట్రంప్ ఎంతకాలం అధ్యక్షులుగా కొనసాగితే అంతకు మించి నిర్లక్ష్యం పెరిగిపోతుంది. ఆయన నిర్లక్ష్యం వల్లనే నిరుద్యోగం పెరిగిపోయింది. ఆధునిక చరిత్రలో హూవర్ తర్వాత అత్యధికంగా ఉద్యోగాలు పోయిన కాలం ట్రంప్‌దే."
- జో బైడెన్, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి
ట్రంప్ దంపతులు ఈ నెల 2న కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో కరోనా సోకినట్లు తేలింది. అనంతరం వారు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. కరోనా లక్షణాలు కొంచెం ఎక్కువ ఉన్నందున ట్రంప్ ఈ నెల 2న వాషింగ్టన్‌లోని వాల్టర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకొని.. నాలుగు రోజుల తర్వాత తిరిగి శ్వేతసౌధానికి చేరుకున్నారు.
ఇదీ చూడండి: ప్లాస్మా దానానికి సిద్ధమే అంటున్న ట్రంప్