అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమెరికా రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ట్రంప్ విఫలమయ్యారని.. ఫలితంగా దేశంలో 2లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
కీలకమైన విస్కాన్సిన్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బైడెన్.. ట్రంప్ తప్పులను క్షమించకూడదన్నారు.
"కరోనా సంక్షోభంతో ఇప్పటికే చాలా కాలం కలిసి జీవించేశాం. ఈ విషయం నాకు ఆందోళన కలిగిస్తోంది. మన దేశం, సంఘాలపై దాని ప్రభావాన్ని మనం పట్టించుకోవడం లేదు. ఇది నన్ను బాధించింది. పోయిన ప్రాణాల పట్ల బాధ, పరిస్థితుల పట్ల కోపాన్ని మనం వదులుకోకూడదు. దురదృష్టవశాత్తు.. అమెరికలో కరోనా మరణాల సంఖ్య 2 లక్షల మార్కును దాటింది. గత 180 రోజుల కన్నా రానున్న 90 రోజుల మరింత దారుణంగా ఉండే అవకాశముంది."
--- జో బైడెన్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి
ఇప్పటివరకు ఎదురైన అన్ని సవాళ్ల నుంచి ట్రంప్ తప్పించుకున్నారని ఆరోపించారు బైడెన్. దేశానికి సమర్థవంతమైన నాయకత్వం కావాల్సి వచ్చిన తరుణంలో ట్రంప్ నిలబడలేదని మండిపడ్డారు. చర్యలు చేపట్టడంలో ఆయన విఫలమయ్యారని... ట్రంప్ భయపడ్డారన్నారు. ఫలితంగా కరోనా సంక్షోభంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమెరికా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బైడెన్.
ఇదీ చూడండి:- 'ట్రంప్ మాటల కన్నా.. వారినే నేను నమ్ముతా'