శ్వేతసౌధం సహా అధికారిక కార్యాలయాల వద్ద జాతీయ జెండాను బుధవారం వరకు అవనతం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిలో గాయపడి మరణించిన అధికారుల గౌరవార్థం ఇలా చేస్తున్నట్లు సమాచారం.
బ్రైన్ డీ సికినిక్, హోవార్డ్ లైబెన్గుడ్ అనే ఇద్దరు పోలీసులు క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన సమయంలో గాయపడ్డారు. వీరు ఆదివారం మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే లైబెన్గుడ్ మరణానికి ఆ దాడే కారణమా లేదా అనే విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కొంతమంది అంటున్నారు.
భయానకం..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు చేపట్టిన కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది ట్రంప్ మద్దతుదారులు ఈ నెల 6న చేపట్టిన ఆందోళన హింసాత్మతంగా మారింది. సమావేశానికి వేదిక అయిన క్యాపిటల్ భవనంలోకి నిరసనకారులు బారికేడ్లు తోసుకుంటూ చొచ్చుకెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల కళ్లలో రసాయనాలు చల్లి వారితో ఘర్షణకు దిగారు. పోలీసులు కాల్పులు కూడా జరపాల్సివచ్చింది.
- ఇదీ చూడండి:రణరంగంలా మారిన అమెరికా క్యాపిటల్ భవనం