అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అఫ్గానిస్థాన్‌లో ఆకస్మికంగా పర్యటించారు. అక్కడి అమెరికా దళాలతో కలసి థ్యాంక్స్ గివింగ్ డే వేడుకలో పాల్గొన్నారు.
పర్యటన సాగిందిలా
కాబుల్‌కు సమీపంలోని బగ్రమ్ వైమానిక స్థావరానికి చేరుకున్న ట్రంప్... అక్కడి క్యాంటిన్‌లోనే సైనికులను కలిశారు. వారికి థ్యాంక్స్ గివింగ్ డే శుభాకాంక్షలు తెలిపారు. సైనికులకు టర్కీ కోడి మాంసంతో చేసిన వంటకాన్ని వడ్డించి, తాను కూడా విందు ఆరగించారు.
ఉత్సాహపూరిత ప్రసంగం
విందు అనంతరం సైనికులతో ఫొటోలు దిగారు ట్రంప్. తర్వాత అఫ్గాన్ అధ్యక్షుడితో సమావేశమై, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అష్రఫ్తో భేటీ అనంతరం వైమానిక స్థావరంలోని వేదిక వద్దనుంచి అమెరికా దళాలను ఉద్దేశించి ఉత్సాహపూరిత ప్రసంగం చేశారు ట్రంప్. ఈ సందర్భంగా అఫ్గాన్‌కు అమెరికా మద్దతుపై కృతజ్ఞతలు తెలిపారు అష్రఫ్ ఘనీ.
"ఈ థ్యాంక్స్ గివింగ్‌ను భూమిపై ఉన్న సమర్థ, బలమైన సైనిక బృందాలతో కలిసి జరుపుకున్నా. ఈ విందు అందరికీ సంతోషం కలింగించిందని భావిస్తున్నా. మీ కుటుంబం, మాతృదేశం మిమ్మల్ని ప్రేమిస్తోంది."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో 12వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ట్రంప్ కార్యక్రమానికి 500 మంది హాజరయ్యారు.
ఉద్రిక్తకర ప్రాంతంలో పర్యటించడం ట్రంప్‌కు ఇది రెండోసారి. గతేడాది క్రిస్మస్ సందర్భంగా ఇరాక్‌లోని అమెరికా దళాలను కలిసేందుకు వెళ్లారు అధ్యక్షుడు.
'తాలిబన్లతో చర్చలు ప్రారంభం'
తాలిబన్లతో అమెరికా చర్చలు పుఃన ప్రారంభమైనట్లు ప్రకటించారు ట్రంప్. అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొల్పే ఉద్దేశంతోనే తాలిబన్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. అయితే అఫ్గాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణపై అధ్యక్షుడు స్పష్టత ఇవ్వలేదు. గత సెప్టెంబర్‌లో తాలిబన్లతో చర్చలు ఆగిపోయినట్లు అమెరికా ప్రకటించింది.
ఇదీ చూడండి: 'అయోధ్య'పై పాక్ కుయుక్తులకు భారత్ దీటైన జవాబు