2020 ఎన్నికల ప్రచారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను చూసి ప్రపంచం అసూయ పడుతోందని వ్యాఖ్యానించారు. దేశాన్ని నాశనం చేయడానికి డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఫ్లోరిడాలోని ఒర్లాండోలో నిర్వహించిన ట్రంప్ ప్రచార సభకు సుమారు 20 వేల మంది ప్రజలు హాజరయ్యారు. తనను అధ్యక్షుడిగా మరోసారి గెలిపించాలని ట్రంప్ వారిని అభ్యర్థించారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థను చూసి ప్రపంచం అసూయపడుతోందని, తనకు మరోసారి అవకాశమిస్తే ఉద్యోగ వృద్ధిని సాధిస్తానని ట్రంప్ అన్నారు.
"మేం అమెరికాను మళ్లీ గొప్పగా ఉంచబోతున్నాం. గతంలో ఎన్నడూ లేనంత గొప్పగా."- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
నకిలీ జర్నలిస్టులు..!
ఎన్నికల ప్రచారానికి వచ్చిన జర్నలిస్టులను ఉద్దేశించి 'నకిలీ పాత్రికేయులు' అని ట్రంప్ విమర్శించారు. అక్కడున్న ప్రజలనూ అలా అనాలంటూ ప్రోత్సహించారు.
డెమోక్రాట్లు దేశాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ట్రంప్.
"మన రాడికల్ డెమోక్రాట్లు ద్వేషం, కోపం, పక్షపాతంతో వ్యవహరిస్తారు. వారు మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నారు. మన దేశాన్ని నాశనం చేయాలనీ చూస్తున్నారని మనకు తెలుసు. ఇది ఆమోదయోగ్యం కాదు. అలా జరగనివ్వను." - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇదీ చూడండి: జీ-20 వేదికలో ట్రంప్ - జిన్పింగ్ భేటీ