అమెరికాలో కరోనా కేసులు చైనాను మించిపోయాయి. ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య లక్షకు చేరింది. ఫలితంగా వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు వైద్య పరికరాల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్‌ను త్వరగా వెంటిలేటర్లు తయారు చేయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఇందుకోసం యుద్ధ సమయాల్లో అమలు చేసే రక్షణ ఉత్పత్తి చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే తయారీ ఖర్చుపై త్వరలో కంపెనీతో చర్చిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.
వెంటిలేటర్ల తయారీ ఒప్పందానికి ప్రాధాన్యం ఇవ్వడంలో రక్షణ ఉత్పత్తి చట్టం కింద వర్తించే అన్ని అధికారాలను ఉపయోగించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శికి జారీ చేసిన మెమొరాండంలో పేర్కొన్నారు ట్రంప్.
వెంటిలేటర్ల సరఫరా చేయగల సామర్థ్యం గురించి జీఎం కంపెనీతో చర్చలు కీలకమైనవి. ప్రస్తుతం వైరస్‌కు వ్యతిరేకంగా మేము పోరాడాల్సిన అవసరం ఉంది. అయితే కంపెనీ సమయాన్ని వృథా చేస్తోంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో అమెరికా ప్రజల ప్రాణాలు రక్షించే వెంటిలేటర్లను త్వరగా ఉత్పత్తి చేసేందుకు సాయపడుతుంది.
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షడు
ఈ 10 రోజుల్లో అగ్రరాజ్యంలో వెంటిలేటర్ల అవసరం 8వేల నుంచి లక్షకు పెరిగింది. ముఖ్యంగా న్యూయార్క్‌లో 40వేల వీటి అవసరం అధికంగా ఉంది. దేశంలో ఎక్కువగా ఈ రాష్ట్రంలోనే 45 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకు అమెరికాలో వైరస్ కారణంగా 1,500 మంది మరణించారు. సుమారు 2,500 మంది పరిస్థితి విషమంగా ఉంది.
అన్ని దేశాలకు వెంటిలేటర్లను అందిస్తాం...
కరోనాతో పోరాడుతున్న మిత్రదేశాలకూ వెంటిలేటర్లు సరఫరా చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ తెలిపారు. ఇటీవలే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్స్‌కు కరోనా పాజిటివ్ తేలింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ జాన్సన్‌తో మాట్లాడగా.. వెంటిలేటర్లు కావాలని ప్రధాని అడిగినట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. అమెరికా సుమారు లక్షకుపైగా వెంటిలేటర్లను ఉత్పత్తి చేస్తోందని, అవసరమైన ప్రతి దేశానికీ వీటిని అందిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.