మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. దీంతో అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. క్యాపిటల్ హిల్ భవనంపై ఈ నెల 6న చెలరేగిన దాడిఘటనను ప్రోత్సహించారని ఆరోపిస్తూ డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. 232-197 ఓట్ల తేడాతో సభలో తీర్మానం నెగ్గింది. ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్‌కు చెందిన 10 మంది సభ్యులు కూడా అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు. నలుగురు కాంగ్రెస్ సభ్యులు ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనలేదు. సభలోని ఇండో-అమెరికన్ సభ్యులు నలుగురూ అభిశంసనకు మద్దతు తెలుపుతూ ఓటేశారు.
సెనేట్‌కు..
ప్రతినిధులసభలో తీర్మానం ఆమోదం పొందిన నేపథ్యంలో తదుపరి సెనేట్‌కు పంపనున్నారు. సెనేట్ దీనిపై విచారణ జరిపి ఓటింగ్‌ను నిర్వహిస్తుంది. సెనేట్‌లో కూడా ఆమోదం పొందితే ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారు. సెనేట్‌లో తీర్మానం ఆమోదం పొందడానికి డెమోక్రాట్లకు 17 మంది రిపబ్లికన్ల ఓట్లు అవసరం. అయితే సెనేట్ ఈ నెల 19కు వాయిదా పడింది.
జో బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకుఈనెల 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా కాంగ్రెస్ సమావేశం కాగా.. దీన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు దాడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, ట్రంప్ మద్దతుదారులకు జరిగిన ఘర్షణలో ఐదుగురు మరణించారు.