విదేశీ నిపుణులకు అందించే హెచ్1బీ సహా ఇతర వర్క్ వీసాలపై ఆంక్షలను మరో మూడు నెలలు పొడింగించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మార్చి 31 వరకు హెచ్1బీ వీసాల రద్దు కొనసాగుతుందని తెలిపారు. దేశంలో కొవిడ్-19 వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. లేబర్ మార్కెట్, కమ్యూనిటీ హెల్త్ వ్యవస్థపై పూర్థిస్థాయిలో వాటి ప్రభావం లేకపోవటం, అమెరికా కార్మికుల ఉద్యోగ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
వివిధ రకాల వర్క్ వీసాలపై ఆంక్షలను గత ఏడాది ఏప్రిల్ 22, జూన్ 22న రెండు సార్లు జారీ చేశారు ట్రంప్. డిసెంబర్ 31తో ఆ గడువు ముగియనుంది. కొద్ది గంటల ముందు తాజాగా మరోమారు ఆదేశాలు జారీ చేశారు.
" అమెరికన్ల జీవనంపై కరోనా తీవ్రత కొనసాగుతోంది. నవంబర్‌లో నిరుద్యోగిత రేటు 6.7 శాతంగా ఉంది. అది గత ఏప్రిల్‌తో పోలిస్తే భారీగా తగ్గింది. అమెరికన్లకు చికిత్స, కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కానీ, వాటి ప్రభావం లేబర్ మార్కెట్, కమ్యూనిటీ హెల్త్‌పై పూర్తిస్థాయిలో లేదు. అంతే కాకుండా, వ్యాపారాలపై రాష్ట్రాలు విధిస్తోన్న ఆంక్షలు కార్మికుల నియామకాలను ప్రభావితం చేస్తున్నాయి. "
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
భారత ఐటీ నిపుణులపై ప్రభావం..
అధ్యక్షుడు ట్రంప్ తాజా నిర్ణయం వందలాది మంది భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అలాగే 2021 ఆర్థిక ఏడాది కోసం గత అక్టోబర్‌లో నుంచి హెచ్1బీ వీసాలు జారీ చేసిన పలు అమెరికా, భారత కంపెనీలపైనా ఈ ప్రభావం పడనుంది. హెచ్1బీ వీసాల కోసం ప్రతి ఏటా భారత్, చైనా నుంచే అధికంగా దరఖాస్తులు వస్తాయి. ట్రంప్ తాజా నిర్ణయం వల్ల మార్చి 31 వరకు వీసా స్టాంపింగ్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
ఇదీ చూడండి: సాగర గర్భంలో చైనా డ్రోన్లు- భారత్ లక్ష్యంగా ఎత్తులు