ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ)కు అమెరికా నిధులు నిలిపివేస్తే.. కరోనా నియంత్రణ చర్యలపై తీవ్ర ప్రభావం పడుతుందని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ లారెన్స్ గోస్టిస్ అభిప్రాయపడ్డారు. నిధుల్ని నిలిపివేయడం వల్ల చైనా రాజకీయంగా విజయం సాధించినట్లేనని స్పష్టం చేశారు.
ప్రస్తుత సంక్షోభ సమయంలో అమెరికా డబ్ల్యూహెచ్ఓను విడిచిపెట్టడం వల్ల ప్రపంచ రాజకీయాల్లో ఆకస్మిక మార్పులు సంభవిస్తాయని లారెన్స్ పేర్కొన్నారు. ఈ చర్య ఎంతమాత్రం క్షమించేది కాదని వ్యాఖ్యానించారు.
"కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. అంతర్జాతీయ స్థాయిలో బాధ్యత వహించడానికి ఇంతకంటే ఉత్తమమైన వేదిక మరొకటి లేదు. ఇప్పుడు ఆ స్థానాన్ని చైనా భర్తీ చేయాలని చూస్తోంది. కానీ చైనాకు ఆ హక్కులేదు. ఎందుకంటే ఆ దేశం ఎప్పుడూ అంతర్జాతీయ పౌరుడిగా ప్రవర్తించలేదు. కానీ అమెరికా అధ్యక్షుడు చైనాకు ఇచ్చిన బహుమతి(నిధుల నిలిపివేత) ఎంతో ప్రమాదకరమైనది. ప్రపంచానికే కాక అమెరికా జాతీయ ప్రయోజనాలకూ అది కీడు కలిగిస్తుంది."
-లారెన్స్ గోస్టిన్, జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్
కరోనా వైరస్ వ్యాపి, కేసుల విషయంలో.. చైనా పారదర్శకత చూపించకపోవడాన్ని గోస్టిన్ అంగీకరించారు. అయితే అమెరికా సైతం డబ్ల్యూహెచ్ఓ సూచనలు పాటించడం లేదని ఆరోపించారు.
సంస్థలో తమ సభ్యత్వాన్ని వదులుకునే విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకునే అధికారం ట్రంప్‌కు లేదని.. ఇందుకు కాంగ్రెస్ అనుమతి కావాలని తెలిపారు గోస్టిన్. డబ్ల్యూహెచ్‌ఓకు నిధుల ఉపసంహరించే అంశంపై ట్రంప్‌నకు సెనేట్ మద్దతివ్వకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
చైనా, డబ్ల్యూహెచ్ఓలపై ట్రంప్ మండిపాటు
కరోనా వ్యాప్తి విషయంలో డబ్ల్యూహెచ్ఓ, చైనాలపై మొదట్నుంచీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కరోనా వైరస్ వ్యాపి, కేసులపై కచ్చితమైన సమాచారాన్ని అందిచకుండా.. చైనా అంతర్జాతీయ వైద్య నిబంధనలను ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. చైనా చేతిలో డబ్ల్యూహెచ్ఓ ఓ కీలుబొమ్మలా పనిచేస్తోందంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తమ దేశం నుంచి డబ్ల్యూహెచ్‌ఓకు అందించే నిధులను తాత్కాలికంగా నిలిపివేస్తామని ప్రకటించారు ట్రంప్. చైనా అధీనంలో కాకుండా స్వతంత్రంగా పనిచేస్తున్నామని 30 రోజుల్లోగా డబ్ల్యూహెచ్ఓ నిరూపించుకోవాలని హెచ్చరించారు.
డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా ఏటా రూ. 3400 కోట్లకుపైగా నిధులను సమకూరుస్తోంది.