కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు రద్దయ్యాయి. అయితే కొన్ని సమావేశాలు మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మార్చి నెలలో అమెరికాలోని ‘క్యాంప్ డేవిడ్’లో జరగాల్సిన జీ-7 సదస్సు కూడా జూన్‌కు వాయిదా పడింది.
కరోనా మరింత విజృంభిస్తున్న తరుణంలో విదేశీ ప్రయాణాలు స్తంభించిపోవడం వల్ల సదస్సు ఎలా నిర్వహించాలనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఈ సమయంలో జీ-7 సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సమావేశం నిర్వహణపై ఆసక్తికరంగా స్పందించారు. కరోనా విలయతాండవం చేస్తున్నప్పటికీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా సభ్యదేశ ప్రతినిధులు నేరుగా హాజరయ్యే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
తద్వారా కరోనా వైరస్ సాధారణ స్థాయికి వచ్చిందనే గొప్ప సంకేతాన్ని ప్రపంచానికి ఇవ్వొచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు. "ఈ సదస్సుకు భాగస్వామ్య దేశాల ప్రతినిధులు కూడా వస్తారని ఆశిస్తున్నా" అని డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అగ్రదేశాల స్పందన..
పరిస్థితులు అనుకూలిస్తే అమెరికాలో జరగబోయే సదస్సుకు నేరుగా హాజరయ్యేందుకు సిద్ధమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రాన్ ప్రకటించారు. ట్రంప్ ప్రతిపాదనపై జపాన్ కూడా సానుకూలంగా స్పందించింది. ఈ విషయంపై అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. మరో భాగస్వామ్య దేశమైన జర్మనీ వేచిచూసే ధోరణిలో ఉంది. కెనడా మాత్రం సదస్సుకు హాజరయ్యే వారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.
కరోనా ప్రభావంతో..
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జీ-7 జట్టులో ఉన్న దాదాపు అన్ని దేశాలు ఈ సారి కరోనా మహమ్మారి ప్రభావానికి అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా అమెరికాతోపాటు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ కరోనా ధాటికి వణికిపోతున్నాయి.
2019లో జరిగిన జీ-7 సదస్సుకు ఫ్రాన్స్ ఆతిథ్యం ఇచ్చింది. కూటమిలో భారత్ సభ్యదేశం కానప్పటికీ ప్రత్యేక ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ హాజరయ్యారు.