అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కొత్త హెచ్ 1బీ విధానానికి తెరతీసింది. ఈ కొత్త విధానం అమెరికన్లకు మరింత మేలు చేస్తుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త వీసా నియమావళి ప్రకారం ఇకపై అమెరికన్ సంస్థల్లో సంవత్సరానికి అత్యధికంగా 85,000 మంది నైపుణ్యం గల విదేశీ ఉద్యోగులను మాత్రమే నియమించుకొనే వీలు కలుగుతుంది. కొత్త వీసా విధానం పూర్తి వివరాలు ఇంకా వెల్లడించనప్పటికీ.. ఇది మరింత కఠినంగా ఉండనుందని, దీని వల్ల హెచ్ 1బీ వీసా పరిధిలోకి వచ్చే 'ప్రత్యేక నైపుణ్యాల'పై కోత పడనుందని తెలుస్తోంది. కొవిడ్-19 ప్రభావం స్థానికులపై పడకుండా నిరోధించేందుకే అమెరికా ఈ కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చిందని కథనాలు వెలువడుతున్నాయి.
హెచ్ 1బీ తదితర వీసాల జారీని ఈ సంవత్సరాంతం వరకు ఆపివేస్తూ గతంలో ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను.. నిలిపివేస్తూ ఆ దేశ న్యాయస్థానం ఇటీవల తీర్పు ఇచ్చింది. కాగా కొత్త నిబంధనల ప్రభావం విదేశీ ఉద్యోగులు, సాంకేతిక సంస్థలపై పడనుందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే భారత్‌కు చెందిన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా తదితర ఐటీ సంస్థలు తమ హెచ్ 1బీ వీసాల సంఖ్యను గత మూడేళ్లుగా తగ్గిస్తూ వస్తున్నాయి. కాగా, ఈ కొత్త నిబంధనల వల్ల ఏటా వచ్చే హెచ్ 1బీ వీసా దరఖాస్తుల సంఖ్యలో మూడో వంతు తగ్గవచ్చని డీహెచ్‌ఎస్ అధికారులు భావిస్తున్నారు.
" విదేశీయులను తక్కువ వేతనాలకే తీసుకొచ్చి అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు ఇక్కడి సంస్థలు హెచ్1బీ వీసాలను దుర్వినియోగం చేశాయి. అమెరికా కార్మికులు మంచి వేతనాలు, మధ్యతరగతి ఉద్యోగాల నుంచి తొలగించి, వారి స్థానంలో విదేశీ కార్మికులతో భర్తీ చేస్తున్నారు. దీని వల్ల అమెరికన్ల వేతన వృద్ధిపైనా తీవ్ర ప్రభావం చూపింది. అది చాలా తప్పు. "
- ప్యాట్రిక్ పిజ్జెల్లా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ అండ్ సెక్యూరిటీ డిప్యూటీ సెక్రటరీ.
కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే ముందు ప్రజాభిప్రాయం కోసం ఈ వారంలోనే ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురిస్తామని వెల్లడించారు అధికారులు.
భారతీయులపై ప్రభావం..
హెచ్1-బీ వీసాలపై నూతన నిబంధనలతో భారతీయులపైనే అధిక ప్రభావం పడనుంది. విదేశీ నిపుణులకు అమెరికా ఏటా 85వేల వరకు హెచ్1బీ వీసాలు జారీ చేస్తోంది. అందులో 60 శాతం వరకు భారత్, చైనా వారే పొందుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో సుమారు 5 లక్షల మంది వరకు ఈ రెండు దేశాలవారే ఉన్నారు.
ఇదీ చూడండి: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. హెచ్-1బీ వీసాల నిషేధం నిలిపివేత