డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో అమెరికాలో అత్యధికంగా 13 మరణశిక్షలు(విషపు ఇంజక్షన్ పద్ధతిలో) అమలు చేశారు. మరణశిక్షలను వ్యతిరేకిస్తోన్న జో బైడెన్ అధికారంలోకి రావడానికి మరికొన్ని రోజుల వ్యవధి ఉండగానే, ఈ తరహా మరణశిక్షల అమలు అమెరికాలో పుంజుకుంది. అమెరికాలో గత పదిహేడేళ్లుగా ఫెడరల్ మరణశిక్షలపై వివాదం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో గతేడాది వీటికి డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో గతేడాది నుంచి ఇప్పటివరకు 13మంది నేరస్థులకు ఫెడరల్ అధికారులు మరణశిక్ష అమలు చేశారు.
67 ఏళ్లలో తొలిసారి..
1996లో జరిగిన ముగ్గురి హత్య కేసులో దోషిగా తేలిన డస్టిన్ హిగ్స్‌కు 2001లోనే మరణశిక్ష పడింది. అయితే, మరణశిక్ష అమలును నిలిపివేస్తూ 2003లో అమెరికా నిర్ణయం తీసుకుంది. తాజాగా ట్రంప్ నిర్ణయంతో ఇండియానాలోని టెర్రే హౌటే కారాగారంలో డస్టిన్ హిగ్స్‌కు మరణశిక్ష అమలు చేశారు. ఇక గత 67ఏళ్లలో తొలిసారిగా ఓ మహిళకు విషపు ఇంజక్షన్ విధానంలో మరణ శిక్ష అమలు చేశారు. ఓ మహిళ గర్భాన్ని కోసి బిడ్డను అపహరించిన కేసులో లీసా మాంట్‌గోమెరీ అనే మహిళకు తాజాగా మరణశిక్ష అమలు చేశారు.
బైడెన్ వస్తే..
అమెరికాలో మరణశిక్షలను ఆయా రాష్ట్రాలు అమలు చేస్తాయి. వీటితో పాటు ఫెడరల్ అధికారులు కూడా మరణశిక్షలను అమలు చేసే వీలుంది. అయితే, 17ఏళ్లుగా వీటిని అమలు చేయలేదు. గత ఏడాది ట్రంప్ నిర్ణయంతో వీటిని మళ్లీ మొదలుపెట్టిన ఫెడరల్ అధికారులు, ఇప్పటివరకు 13మందికి మరణశిక్ష అమలు చేశారు. ఈ విధానంలో మరణశిక్షలను నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో బైడెన్ అధికారంలోకి రాగానే వీటికి ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరోనా సోకినా..శిక్ష అమలు
కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న అమెరికాలో అక్కడి జైళ్లలోనూ కేసుల సంఖ్య పెరిగింది. వీరిలో మరణశిక్ష పడిన డస్టిన్ హిగ్స్, కొరే జాన్సన్ వంటి దోషులు ఉన్నారు. అయినప్పటికీ వీరికి ఫెడరల్ అధికారులు మరణశిక్ష అమలు చేశారు.
ఇదీ చదవండి : బైడెన్ ప్రమాణస్వీకారం రోజే శ్వేతసౌధం వీడనున్న ట్రంప్!