విదేశీ సాంకేతిక నిపుణులకు అందించే హెచ్-1బీ వీసా ప్రక్రియలో కీలక మార్పులు చేసేందుకు ప్రతిపాదించింది అమెరికా ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న కంప్యూటరైజ్డ్ లాటరీ వ్యవస్థను తొలగించి.. ఆ స్థానంలో వేతనం ప్రాతిపదికన వీసాలు జారీ చేయాలని సూచించింది. అమెరికన్ల వేతనాలపై పడుతున్న భారాన్ని ఇది తగ్గిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ కొత్త వ్యవస్థకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది డీహెచ్ఎస్( డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ). అధ్యక్ష ఎన్నికలకు వారం రోజులే గడువున్న నేపథ్యలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నోటిఫికేషన్‌పై స్పందించేందుకు 30రోజుల గడువిచ్చింది.
తాజా ప్రతిపాదనను అమలు చేస్తే.. విదేశీ ఉద్యోగులకు సంస్థలు అధిక జీతాలు చెల్లించాల్సి వస్తుంది. అదే సమయంలో ఆ స్థాయిలో జీతాలు పొందడానికి విదేశీయుల్లో నైపుణ్యం ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది.
ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే... ఇమ్మిగ్రేషన్ సర్వీస్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. సీఓసీసీ (స్టాండర్డ్ ఆక్యుపేషనల్ క్లాసిఫికేషన్ కోడ్)కు సమాన లేదా దానికి మించిన వేతనాలు ఉన్న పిటిషనర్లకు హెచ్-1బీ వీసా మంజూరు చేసేందుకు అధిక ప్రాధాన్యతనిస్తారు.
'అమెరికన్ ఫస్ట్' విధానంలో భాగంగా అమెరికన్లకు ఉద్యోగాలిచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగ లక్ష్యానికి ఈ తాజా ప్రతిపాదన సహాయపడుతుందని అధికారవర్గం చెబుతున్నాయి.
ఇదీ చూడండి:- హెచ్-1బీపై ఆంక్షలతో అమెరికాకే ఆర్థిక ముప్పు..!