అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు చివరి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పదవిలో ఉన్నంత కాలం డ్రాగన్‌తో కయ్యానికి కాలుదువ్విన ఆయన చివరి రోజుల్లోనూ వదిలిపెట్టడం లేదు. ఆర్థికంగా చైనాను బలహీనపరిచేందుకు ఉన్న అన్ని అస్త్రాల్ని సంధిస్తున్నారు. తాజాగా చైనా టెలికాం దిగ్గజం, 5జీ సాంకేతికతకు ప్రసిద్ధి గాంచిన హువావే టెక్నాలజీస్‌కు షాక్ ఇవ్వబోతున్నారు.
అమెరికాలోని ఇంటెల్ సహా మరికొన్ని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు హువావేకు పరికరాలను సరఫరా చేస్తున్నాయి. ఈ అనుమతుల్ని రద్దు చేసేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఎగుమతుల కోసం కొత్తగా చేసుకున్న దరఖాస్తులను కూడా తిరస్కరించే యోచనలో ఉన్నారు. దాదాపు 150 అనుమతుల్ని ట్రంప్ రద్దు చేయనున్నట్లు సమాచారం. వీటి విలువ దాదాపు 120 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. మరో 280 బిలియన్ డాలర్ల ఒప్పందాలకు చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ తాజా నిర్ణయంతో అవన్నీ నిలిచిపోయే అవకాశం ఉంది. హువావేకు అమెరికా నుంచి ఎలాంటి పరికరాలు వెళ్లకూడదని ట్రంప్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయా కంపెనీలకు వాణిజ్య శాఖ నోటీసులు జారీ చేసింది. ట్రంప్ నిర్ణయంపై 20 రోజుల్లోగా స్పందించాలని తెలిపింది.
5జీ సాంతికేతికతను సమకూర్చే అంశంలో హువావే ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ట్రంప్ మాత్రం దాన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వచ్చారు. చైనా సాంకేతికత వల్ల సమాచారం దోపిడీకి గురవుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో హువావేను బహిష్కరించాలని పాశ్చాత్య దేశాలను సైతం ఆయన కోరారు. దీంతో హువావేతో ఉన్న ఒప్పందాన్ని యూకే రద్దు చేసుకుంది.
ఇదీ చదవండి: గుజరాత్లో మెట్రో ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన