పురుషుల్లో తగ్గుతున్న పునరుత్పత్తి సామర్థ్యం కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్న 30 నుంచి 50 శాతం మందిలో సమస్యేంటన్నది వైద్యులు కూడా గుర్తించలేకపోతున్నారు. అమెరికాలో ప్రతి ఎనిమిది జంటల్లో ఒక జంట సంతానప్రాప్తికి నోచుకోవడంలేదు. "సమస్యేంటో మాకూ బోధపడటంలేదు. నేను చేయగలిగిందేమీ లేదు" అని రోగులకు చెప్పాల్సి రావడం తమకు బాధాకరంగా ఉంటోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పిడుగులాంటి ఈ వార్త విని హతాశులైన జంటలు.. "ఎందుకిలా జరిగింది? మా ఉద్యోగ జీవితాలు, సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ప్లాస్టిక్ పదార్థాలు.. ఇలాంటివేమైనా ప్రభావం చూపాయా?".. అంటూ ఆవేదనగా వైద్యులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వారి అనుమానాలు చాలావరకూ నిజమేనని పరిశోధనల ఫలితాలు చెబుతున్నాయి.
కారణాలు అనేకం..
ఊబకాయం, హార్మోన్లలో అసమతౌల్యం, జన్యుపరమైన వ్యాధులు.. ఇలా అనేక అంశాలు సంతాన సాఫల్యతపై ప్రభావం చూపొచ్చు. చికిత్సల ద్వారా అనేక మంది పురుషుల్లో ఇబ్బందిని సరిచేసే వీలుంది. అయితే మగవారిలో సంతానలేమికి కారణాలుగా భావిస్తున్న అనేక అంశాలను అదుపు చేయగలిగినప్పటికీ సంతానసాఫల్యత దశాబ్దాలుగా తగ్గిపోతూ వస్తున్నట్లు 1990లలో పరిశోధకులు గుర్తించారు. 60 ఏళ్ల కిందటితో పోలిస్తే పురుషుల్లో వీర్యం కౌంట్ ఏకంగా 50 శాతం మేర తగ్గినట్లు 1992లో ఓ అధ్యయనం తేల్చింది. 1973 నుంచి 2011 మధ్య ప్రపంచవ్యాప్తంగా మగవారిలో వీర్య గాఢత 50-60 శాతం మేర తగ్గినట్లు మరో పరిశోధన తేల్చింది. అయితే ఇవవ్నీ శుక్రకణాల సంఖ్య, గాఢతపై జరిగినవే. అయితే 'చురుకైన వీర్య కణాల సంఖ్య' ద్వారా సంతానయోగ్యతపై కచ్చితమైన లెక్కలు వేసే వీలున్న నేపథ్యంలో 2019లో శాస్త్రవేత్తలు దీనిపై దృష్టి పెట్టారు. ఈ సంఖ్య ఆరోగ్యకరమైన స్థాయిలో కలిగిన పురుషులు గడిచిన 16 ఏళ్లలో దాదాపు 10 శాతం మేర తగ్గినట్లు వెల్లడైంది. ఇందుకు దారితీస్తున్న పరిస్థితులేంటన్న దానిపై దృష్టి పెట్టినప్పుడు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
పర్యావరణ విషతుల్యత
విషత్యుల రసాయనాల ప్రభావానికి గురైతే హార్మోన్లలో సమతౌల్యం, పునరుత్పత్తి సామర్థ్యం సన్నగిల్లే అవకాశం ఉందని జంతువులపై జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. ఇలాంటి ప్రయోగాలు మానవులపై నిర్వహించడం అసాధ్యం. అయితే వివిధ రసాయనాలు చూపే ప్రభావాలపై మదింపు వేయవచ్చు. ఇందులో భాగంగా.. పర్యావరణంలోకి చేరుతున్న గరళాలపై శాస్త్రవేత్తలు పరిశీలన సాగించారు. నిర్దిష్టంగా ఏ రసాయనాలు పురుషుల్లో సంతానసాఫల్యతకు అవరోధంగా మారాయన్నది స్పష్టంకాకపోయినా.. కొన్ని గరళ పదార్థాలకు సంబంధించి ఆధారాలు లభ్యమవుతున్నాయి. ప్రధానంగా ఎండోక్రైన్ విచ్ఛిన్నకారకాలపై దృష్టిసారించారు. ఇవి పునరుత్పత్తికి సంబంధించిన సున్నితమైన హార్మోన్ సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంటాయి. వీటిలో ప్లాస్టిసైజర్లు, క్రిమిసంహారక మందులు, హెర్బిసైడ్లు, భార లోహాలు, విషతుల్య వాయువులు, కృత్రిమ పదార్థాలు ఉన్నాయి.
- ప్లాస్టిసైజర్లు.. వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాలను నిల్వచేసే డబ్బాలు సహా అనేక రకాల ప్లాస్టిక్‌లలో ఉంటాయి. పురుషుల్లోని టెస్టోస్టిరాన్, వీర్యకణ ఆరోగ్యంపై ఇవి ప్రతికూల ప్రభావం చూపుతాయని వెల్లడైంది.
- ఆహార పదార్థాల్లో చేరుతున్న హెర్బిసైడ్లు, క్రిమిసంహారక మందులు.. ముఖ్యంగా ఫాస్ఫరస్‌తో కూడిన కృత్రిమ ఆర్గానిక్ పదార్థాలు సంతానోత్పత్తి సామర్థ్యానికి విఘాతం కలిగిస్తున్నాయి.
- నగరాలను ముంచెత్తుతున్న వాయు కాలుష్యం వల్ల ప్రజలు పార్టిక్యులేట్ మేటర్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి వాయువులకు ఎక్కువగా గురవుతున్నారు. దీనివల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గుతోంది.
- ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, మోడెమ్ వంటి సాధనాల నుంచి వెలువడే రేడియోధార్మికత కూడా వీర్యం కౌంట్, కదలికలు, ఆకృతి దెబ్బతినడానికి కారణమవుతున్నాయి.
- ఆహారం, నీరు, సౌందర్య లేపనాల్లోని క్యాడ్మియం, సీసం, ఆర్సెనిక్ వంటివి పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి.
- కట్టడిలేని రసాయనాలు
- నేడు 'నేషనల్ టాక్సికాలజీ ప్రోగ్రామ్'లో 80వేలకుపైగా రసాయనాలు నమోదయ్యాయి. 1978లో ఈ ప్రోగ్రాం మొదలైనప్పుడు 60వేల రసాయనాలు ఉండేవి. మానవ ఆరోగ్యం, పర్యావరణానికి కలిగే ముప్పులను పరిశీలించకుండానే వీటిని తయారుచేస్తున్నారని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వ నియంత్రణ సంస్థలు వీటిపై సరిగా దృష్టి సారించడంలేదని పేర్కొంటున్నారు.
సంతాన సాఫల్యతను ఎలా అంచనా వేస్తారు?
దంపతులు సాధారణ శృంగార జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ఏడాదికాలంలో భార్య గర్భం దాల్చలేకపోవడాన్ని సంతానలేమిగా నిర్వచిస్తారు. ఇలాంటి సందర్భాల్లో వైద్యులు.. ఆ జంటను పరీక్షించి, కారణాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తారు. పురుషుల విషయంలో సంతాన సాఫల్య సామర్థ్యాన్ని పరీక్షించేందుకు వీర్యాన్ని విశ్లేషించడం కీలకం. ఇందులో భాగంగా.. వీర్య కణాల సంఖ్య (ఆ వ్యక్తి ఉత్పత్తి చేసే మొత్తం శుక్ర కణాలు), గాఢత (మిల్లీలీటరు వీర్యంలో శుక్రకణాల సంఖ్య)పై ఎక్కువగా మదింపు చేస్తుంటారు. అయితే సంతాన సాఫల్యతను అంచనా వేయడానికి ఇవి అత్యుత్తమ సూచికలు కావని నిపుణులు చెబుతున్నారు. వీర్యంలో చురుగ్గా కదిలే శుక్రకణాల సంఖ్యను నిర్ధరించడం ద్వారా సంతానయోగ్యతపై కచ్చితమైన లెక్కలు వేయవచ్చని వివరిస్తున్నారు.
ఇదీ చూడండి: మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కరోనా దెబ్బతీస్తుందా?