అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోలేదంటూ భీష్మించుకు కూర్చున్న డొనాల్డ్ ట్రంప్ తన మొండిపట్టు వీడుతున్నట్లు కన్పిస్తోంది. 'ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదు' అని గత కొన్ని రోజులుగా చెబుతున్న ఆయన.. తాజాగా తదుపరి ప్రభుత్వం ఎవరిదనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. శ్వేతసౌధంలోని రోజ్ గార్డెన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు.
కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలపై ట్రంప్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నివారణకు అమెరికాలో మరోసారి లాక్‌డౌన్ తీసుకొచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తదుపరి ప్రభుత్వం ఎవరిదనేది తెలియదంటూ ఎన్నికల్లో ఓటమి గురించి పరోక్షంగా ప్రస్తావించారు.
"భవిష్యత్‌లో ఏదైనా జరగొచ్చు. వచ్చేది ఏ ప్రభుత్వమో ఎవరికి తెలుసు? దానికి కాలమే సమాధానం చెబుతుంది. అయితే మేం మాత్రం లాక్‌డౌన్‌కు వెళ్లం" అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
నవంబరు 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఫలితాలు వెలువడి వారం గడిచినా ఓటమిని అంగీకరించట్లేదు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ముందు నుంచి ఆరోపిస్తూ వస్తోన్న ట్రంప్.. ఫలితాలపై న్యాయపోరాటానికి దిగారు. తన ఓట్ల దొంగలించారంటూ పలు రాష్ట్రాల్లోని కోర్టుల్లో ఇప్పటికే వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇదీ చూడండి: అమెరికా కోర్టుల్లో ట్రంప్‌కు తప్పని భంగపాటు