కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న న్యూయార్క్‌లో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. ఫలితంగా ఈ రాష్ట్రంలో ఆంక్షలను సడలించి ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కౌమో.. ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఇందులో మాస్టర్‌కార్డ్ సీఈఓ అజయ్ బంగా సహా ముగ్గురు భారతీయ అమెరికన్లకు చోటు కల్పించారు.
దాదాపు 100 మంది సభ్యులున్న ఈ మండలికి గవర్నర్ మాజీ కార్యదర్శులు స్టీవ్ కొహెన్, బిల్ మల్రో నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో రాష్ట్రంలోని పరిశ్రమలకు చెందిన వ్యాపారవేత్తలు, సామాజిక, పౌర నేతలకు చోటుకల్పించారు.
ముగ్గురికి చోటు..
ఈ మండలిలో అజయ్ బంగాతో పాటు టాండన్ క్యాపిటల్ అసోసియేట్స్ అధినేత్రి చంద్రికా టాండన్, న్యూయార్క్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ దండపాణి ఉన్నారు.
- అజయ్ బంగా.. మాస్టర్‌కార్డ్ సీఈఓగా వచ్చే ఏడాది తప్పుకోనున్నారు. 2021 మార్చి 1 నుంచి సంస్థకు అధ్యక్షునిగా కొనసాగుతారు.
- చంద్రికా టాండన్.. ఈమెకు చెందిన క్యాపిటల్ అసోసియేట్స్ న్యూయార్క్‌లోని అనేక విశ్వవిద్యాలయాలకు సలహాలు అందిస్తోంది. అంతేకాకుండా చాలా విశ్వవిద్యాలయ బోర్డుల్లో సభ్యులుగా ఉన్నారు.
- దండపాణి.. న్యూయార్క్ హోటల్ పరిశ్రమలో కురువృద్ధుడు. 1998 నుంచి నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఉన్నారు. 2002లో తొలి 50 మంది ఆసియా అమెరికా వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు.
అమెరికాలో కరోనా వైరస్‌కు కేంద్ర బిందువుగా మారిన న్యూయార్క్‌లో ఇప్పటివరకు 2.95 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇక్కడ క్రమంగా కేసులతో పాటు మరణాలు సంఖ్య తగ్గుతూ వస్తోంది. నగరంలో మంగళవారం 337 మంది చనిపోయారు.
10 లక్షలు దాటిన కేసులు..
అమెరికాలో కరోనా ధాటికి ఇప్పటివరకు 59,266 మంది మరణించారు. ఇది వియత్నాంతో రెండు దశాబ్దాల పాటు జరిగిన యుద్ధంలో మరణించిన సైనికుల సంఖ్య కన్నా ఎక్కువ. 1955-1975లో ఇరు దేశాల మధ్య జరిగిన పోరులో 58,220 మంది మృతిచెందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
అగ్రరాజ్యంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య మంగళవారానికి 10లక్షలు దాటి 10,35,765కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మూడో వంతు కేసులు అమెరికాలోనే ఉన్నాయి. ఇక ప్రపంచ దేశాల్లో కరోనా బారినపడి మరణించిన వారిలో నాలుగో వంతు మరణాలు అమెరికాలోనే సంభవించాయి.