కరోనా ప్రపంచవ్యాప్తంగా (Covid 19 News) ఉద్యోగులకు కొత్త పాఠం నేర్పింది. జీవితంలో భయంకర కోణాలను చూపించింది. కుటుంబం విలువను మరోసారి తెలియజేసింది. బంధాలను బలోపేతం చేసింది. అంతేకాదు.. డబ్బు లేకపోతే పరిస్థితి ఏమిటో చవిచూపింది. ఆయా సంస్థల్లో ఏళ్ల తరబడి నమ్మకంగా పని చేసినా కూడా కష్టకాలంలో యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం వారి మనసును గాయపర్చింది. సుదీర్ఘమైన షిఫ్టులు.. లే ఆఫ్‌లు.. వేతన కోతలతో తమను కంపెనీలు ఎక్కువగా వాడుకుంటున్నాయన్న భావన ఉద్యోగుల్లో బలంగా నాటుకొంది. ఇప్పుడు కరోనా వ్యాప్తి తగ్గింది. వ్యాపారాలు పుంజుకున్నాయి. కంపెనీలు ఆకర్షణీయ వేతనాలు, ప్యాకేజీలు ఇస్తామన్నా ఉద్యోగులు ఉండటం లేదు. రాజీనామా చేసి కొత్త మార్గం వెతుక్కునే పనిలో పడ్డారు. రాజీనామాలు చేయడానికి ఏమాత్రం భయపడటం లేదు. భవిష్యత్తును భద్రం చేసుకొనేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల్లో 'ది గ్రేట్ రెజిగ్నేషన్' (The Great Resignation 2021) సంక్షోభం మొదలైంది.
ఏమిటీ రాజీనామాల సంక్షోభం..!
'ది గ్రేట్ రెజిగ్నేషన్' (The Great Resignation 2021) అనే పదాన్ని తొలిసారి 2019లో ఏ అండ్ ఎం ప్రొఫెసర్ ఆంటోనీ క్లాట్జ్ ప్రయోగించారు. కొవిడ్ తర్వాత ఉద్యోగులు కోట్ల సంఖ్యలో తమ కొలువులకు రాజీనామా చేస్తారని భవిష్యత్తు గురించి అంచనా వేశారు. ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చింది. ఒక్క అమెరికాలోనే ఆగస్టులో 43 లక్షల మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇది ఆ దేశ మొత్తం ఉద్యోగాల్లో 2.9 శాతం. ఈ విషయాన్ని అమెరికాలో గురువారం విడుదల చేసిన లేబర్ డిపార్ట్‌మెంట్ డేటా చెబుతోంది. కంపెనీలకు వెన్నులో చలిపుట్టించే మరో విషయాన్నీ 'గాల్ అప్' డేటా వెల్లడించింది. అమెరికాలో 50 శాతం మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం చురుగ్గా వేట మొదలు పెట్టారని పేర్కొంది.
- ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మంది ఉద్యోగులు కంపెనీలు మారటంపై గానీ, రాజీనామాలపై గానీ ఆలోచిస్తున్నారని మార్చిలోనే మైక్రోసాఫ్ట్ సర్వే పేర్కొంది.
ఏ రంగాల్లో ఎక్కువగా ఉంది?
ఈ ఉద్యోగుల రాజీనామాల పరంపర అన్ని రంగాల్లోనూ కనిపిస్తోంది. కానీ, కొన్ని రంగాల్లో మాత్రం అత్యధికంగా ఉంది. ముఖ్యంగా రిటైల్, గోదాములు, రెస్టారెంట్లు, హెల్త్‌కేర్, సోషల్ అసిస్టెన్స్ రంగాల్లో రికార్డు స్థాయిలో ఉద్యోగులు రాజీనామాలు చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా తక్కువ వేతనాలకు పనిచేస్తున్న ఉద్యోగులు తమ కంపెనీలకు గుడ్ బై (The Great Resignation) చెప్పేస్తున్నారు. దీనిని 'ఒత్తిడి వాతావరణంలో పనిచేసినా తక్కువ వేతనాలు అందడంపై తిరుగుబాటు'గా వాషింగ్టన్ పోస్టు పత్రిక పేర్కొంది. అసౌకర్యవంతమైన పని గంటలు, తక్కువ ప్రతిఫలంతో పనిచేయడానికి చాలామంది ఇష్టపడంలేదు. ఆగస్టులో నమోదైన రాజీనామాల్లో 40 శాతం రెస్టారెంట్లు, హోటళ్ల రంగంలోనే ఉన్నాయి. పంపిణీ వ్యవస్థలు దెబ్బతినడం వల్ల ఒత్తిడి పెరిగిపోయి తయారీ, గోదాముల్లోని పనివారు కూడా ఉద్యోగాలను వదిలేస్తున్నారు. కొందరు ఏకంగా తమ కంపెనీల తీరుపై సోషల్ మీడియాల్లో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. #QuitMyJob వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్విటర్లో ట్రెండ్ అవుతున్నాయి. టెక్సాస్‌లో ఓ మహిళ వాల్‌మార్ట్‌పై ఆరోపణలు చేస్తూ టిక్‌టాక్‌లో వీడియో పోస్టు చేసింది. దీంతో వాల్‌మార్ట్ రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అమెరికాలో (The Great Resignation USA) భారీ సంఖ్యలో మహిళలు కొలువులను వీడుతున్నట్లు లేబర్ డిపార్ట్‌మెంట్ సర్వే గణంకాలు చెబుతున్నాయి.
ఉద్యోగులు పని వాతావరణానికి ప్రాధాన్యమివ్వడం కూడా రాజీనామాలకు (The Great Resignation) కారణంగా మారుతోంది. 'స్టేట్ ఆఫ్ వర్క్ ఇన్ అమెరికా' సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగులు సౌకర్యవంతంగా ఉండే కొలువు కోసం వేతన పెంపును కూడా వదులుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ సర్వే చెబుతోంది.
పరిశ్రమలకు తిప్పలు..
ఇప్పటికే ఉన్న నిరుద్యోగానికి (Unemployment News) తోడు కొత్తగా ఈ రాజీనామాల సునామీ కూడా చేరింది. అమెరికాలో ఆగస్టులో 1.4 కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిపై చిన్న వ్యాపారాల యజమానులు పూర్తిగా నిరాశతో ఉన్నట్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ బిజినెస్ సర్వే పేర్కొంది. ఉద్యోగులను కాపాడుకునేందుకు ఇప్పుడు చాలా కంపెనీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయని ప్రొఫెసర్ ఆంటోనీ క్లాట్జ్ పేర్కొన్నారు. ప్రతిభావంతులను ఉద్యోగాల్లోకి తీసుకొనేందుకు చాలా కంపెనీలు జీతాలను పెంచడం, బోనస్, ఇతర ఒప్పందాలతో ఆకర్షిస్తున్నాయి. అమెరికా చరిత్రలో తొలిసారి రెస్టారెంట్లు, బార్లలో పనిచేసేవారి గంట వేతనం 15 డాలర్లకు చేరింది. ఇక అమెజాన్, సీవీసీ, వాల్‌గ్రీన్స్ కూడా ఇంతే మొత్తం చెల్లిస్తున్నాయి. దీంతోపాటు వాల్‌మార్ట్, టార్గెట్, అమెజాన్ వంటి కంపెనీలు ఉద్యోగులకు ఉచితంగా కాలేజీ ట్యూషన్ ఫీజు, టెక్స్ట్ బుక్స్ వంటివి ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. రాజీనామా చేసిన వారు తొలుత ఏ ఉద్యోగం వస్తే అందులోకి చేరేందుకు ఆసక్తిగా ఉండటం లేదు. వారికి ఇష్టం లేని పని వాతావరణం నుంచి ధైర్యంగా తప్పుకొంటున్నారు.
ఐరోపా దేశాలకూ తిప్పలే..
ఐరోపా ఖండంలో (The Great Resignation UK) కొవిడ్ సంబంధిత రాజీనామాలు (The Great Resignation) అత్యధికంగా జర్మనీలో ఉన్నాయి. మొత్తం ఆరు శాతం మంది ఉద్యోగులు కొలువులను వదిలేశారు. ఆ తర్వాత 4.7 శాతంతో యునైటెడ్ కింగ్‌డమ్, 2.9 శాతంతో నెదర్లాండ్స్, 2.3 శాతంతో ఫ్రాన్స్, 1.9 శాతంతో బెల్జియం ఉన్నాయి.
ఇదీ చూడండి: భారత్‌లో ఉద్యోగాల విపణి కళకళ- సెప్టెంబరులో 57% వృద్ధి