ఆఫ్రికన్-అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరసనగా వెల్లువెత్తిన ఆందోళనలతో అగ్రరాజ్యం అట్టుడుకుతూనే ఉంది. కర్ఫ్యూను లెక్కచేయని అమెరికన్లు.. భారీగా వీధుల్లోకి చేరుకుంటున్నారు. అరెస్టులు, అల్లర్లు, వాగ్వాదాలు, లూటీలు, హింసాత్మక పరిస్థితులతో అమెరికా రణరంగాన్ని తలపిస్తోంది. అల్లర్ల కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. 4 వేలమందికిపైగా అరెస్టయ్యారు. బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించింది.
న్యూయార్క్, ఫిలడెల్ఫియా, చికాగో, వాషింగ్టన్ డీసీల్లో కర్ఫ్యూ ఉన్నప్పటికీ వేలాది మంది నిరసనలు కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల ఆందోళనలు హింసకు దారితీశాయి. 'హ్యాండ్స్ అప్, డోన్ట్ షూట్', 'నో జస్టిస్, నో పీస్' నినాదాలతో పలు ప్రాంతాలు హోరెత్తుతున్నాయి.
ఫ్లాయిడ్ మృతితో తొలుత శాంతియుతంగానే ప్రారంభమైన నిరసనలు.. క్రమక్రమంగా హింసాత్మకంగా మారాయి. ఇదే అదునుగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేయడం, కొల్లగొట్టడం ఎక్కువయ్యాయి. సోమవారం రాత్రి పెద్ద పెద్ద స్టోర్లలో లూటీలు జరిగాయి. పలు చోట్ల వాహనాలకు నిప్పంటించారు ఆందోళనకారులు.
కొన్ని దశాబ్దాలుగా.. అమెరికా నల్లజాతీయుల్లో ఉన్న తీవ్ర అశాంతి, ఆగ్రహం ఒక్కసారిగా పెల్లుబికాయి. ఆర్థిక, సామాజిక అసమానత్వం, వివక్ష, జాత్యహంకారంపై ఏళ్లుగా కూడగట్టుకున్న అసంతృప్తి, ఆవేదన ఈ నిరసనల్లో బయటపడుతోంది.
హ్యూస్టన్‌లో భారీ ర్యాలీ...
జార్జి ఫ్లాయిడ్ మరణించిన హ్యూస్టన్‌లో నిరసనలు శాంతియుతంగా సాగుతున్నాయి. వేలాది మంది మాస్కులు ధరించి.. ప్రదర్శనలు చేస్తున్నారు.
ఫ్లాయిడ్‌కు నివాళిగా ఆయన కుటుంబంలోని 16 మంది సహా మొత్తం 60 వేలమందికిపైనే.. హ్యూస్టన్‌లోని డిస్కవరీ గ్రీన్ నుంచి సిటీహాల్ వరకు ర్యాలీ తీశారు. ర్యాపర్లు, రాజకీయ నాయకులు, మేయర్, చట్టసభ్యులు సహా చాలా మంది ప్రముఖులు ప్రదర్శనలో పాల్గొన్నారు.
అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని, ట్రంప్‌ను బాధ్యుడిని చేస్తూ అభిశంసించాలని చట్టసభ్యుడు గ్రీన్ వ్యాఖ్యానించారు.
లేక్వుడ్ చర్చి పాస్టర్.. ఫ్లాయిడ్ కుటుంబసభ్యులతో ప్రార్థనలు నిర్వహించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మద్దతుదారులంతా మోకాళ్లపై కూర్చొని 30 సెకండ్ల పాటు మౌనం పాటించారు.
అన్నంత పని చేసిన ట్రంప్..
అమెరికాలో నిరసనలు హింసాత్మకంగా మారిన వేళ.. అల్లర్లను అణచివేయటానికి వేలాది మంది భారీ సాయుధ బలగాలను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అన్నంత పని చేశారు. శ్వేతసౌధం సమీప వీధుల్లో భారీగా సైనిక వాహనాలు ప్రత్యక్షమయ్యాయి. వేలాది మంది గుమిగూడిన లఫాయెట్టే పార్క్ వద్ద భద్రతా సిబ్బందిని మోహరించారు.
వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి మొత్తం 28 రాష్ట్రాల్లో 20 వేల 400 మందికిపైగా బలగాలు రంగంలోకి దిగాయని తెలుస్తోంది.
పోలీసులకు గాయాలు..!
సెయింట్ లూయిస్‌లో నిరసనల్లో పోలీసులు గాయపడ్డారు. ఆందోళనలు చేస్తున్న వారిని నిలువరించే సమయంలో తీవ్రంగా గాయపడి నలుగురు పోలీసు అధికారులు ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
జార్జియాలో కొంతమంది విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించిన ఆరుగురు పోలీసులు నేరాభియోగాల్ని ఎదుర్కొన్నారు. ఇక్కడ నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించిన అనంతరం.. సాయుధ బలగాలు భద్రత చర్యలను కట్టుదిట్టం చేశాయి.
పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా న్యూయార్క్ వీధుల్లో భారీ ర్యాలీగా బయల్దేరారు అమెరికన్లు.
ఇతర ప్రాంతాల్లో...
బోస్టన్‌లోనూ వేర్వేరు చోట్ల నిరసనలు మిన్నంటాయి. 'బ్లాక్ విత్ మ్యాటర్', 'నో జస్టిస్ నో పీస్' అంటూ నినదించారు.
లాస్ ఏంజెలిస్‌లో వందలాది మంది ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు.. లాస్ ఏంజెలిస్ టైమ్స్ ధ్రువీకరించింది.
వాషింగ్టన్ డీసీలో కర్ఫ్యూ నిబంధనలు ధిక్కరించి.. వేలాది మంది వైట్‌హౌస్ ఎదురుగా ఉన్న పార్కులో ధర్నాకు దిగారు. ఇక్కడి సెనేటర్ ఎలిజబెత్ వారెన్ కూడా నిరసనల్లో పాల్గొనడం విశేషం.
ఇతర దేశాల్లో ఫ్లాయిడ్‌కు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారు. ఫ్రాన్స్‌లో నిరసనలు ఘర్షణ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
మెలానియా అభ్యర్థన...
దేశంలో జరుగుతున్న ఆందోళనలపై స్పందించారు అమెరికా ప్రథమ మహిళ, ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్. కర్ఫ్యూను పాటిస్తూ కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలని, వీధుల్లో నిరసనలను ఆపాలని ప్రజల్ని కోరారు. అంతకుముందు అమెరికాలో హింసాత్మక సంఘటనలు తనను బాధించాయని చెప్పుకొచ్చారు. ఫ్లాయిడ్ మృతిపై.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
పోలీసులపై దర్యాప్తు..
ఫ్లాయిడ్ మృతికి కారణమైన మినియాపోలిస్ పోలీసులపై తీవ్ర చర్యలు తప్పవని అధికారులు సంకేతాలిచ్చారు. నగర పోలీసుశాఖపై పౌరహక్కుల దర్యాప్తును ప్రారంభించారు. దర్యాప్తు చేయాల్సిందిగా మిన్నెసొటా మానవహక్కుల విభాగం, గవర్నర్ ఫిర్యాదు చేశారు. జాత్యహంకారంపై దీర్ఘకాలిక పరిష్కారం వచ్చేలా.. దర్యాప్తు జరగాలని కోరారు.