క్యూబాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనను ఢీకొట్టి బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
హవానాకు పశ్చిమావన 40 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగిందని క్యూబా జాతీయ రహదారి భద్రతా కమిషన్ వెల్లడించింది. క్యూబా రాజధానిలోని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు.. తూర్పు రాష్ట్రమైన గ్రాన్మాకు తిరిగి వెళ్తుండగా.. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవటం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. వంతెనను ఢీ కొట్టి బస్సు బోల్తా పడిందని పేర్కొన్నారు.
ఈ ఘటనలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
అధ్యక్షుడి సంతాపం..
ఈ ఘటనపై క్యూబా అధ్యక్షుడు మిగ్యువెల్ దియాజ్-కానెల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.
ఇదీ చదవండి: పార్కులో అగ్ని ప్రమాదం- తప్పిన ప్రాణాపాయం